Breaking News

అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం

సారథి న్యూస్​, హైదరాబాద్: అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ సంక్షేమ పథకాలు, సరికొత్త ఆవిష్కరణలతో దేశానికే దిక్సూచిలా మారిన తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రజలు సుదీర్ఘ, శాంతియుత పోరాటం ద్వారా స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారని కొనియాడారు. ఆరేళ్ల కాలంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ప్రజల బలమైన భాగస్వామ్యంతో బంగారు తెలంగాణ అతిత్వరలోనే ఆవిష్కృతమవుతుందన్నారు. కరోనా క్లిష్టపరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు.
గవర్నర్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జన్మదిన సందర్భంగా సీఎం కేసీఆర్​ శుభాకాంక్షలు తెలిపారు. హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ, ఎంపీలు కె.కేశవరావు, జోగినిపల్లి సంతోష్ కుమార్, సురేష్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్​పల్లి వినోద్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి విషెస్​ తెలిపారు.