సారథి న్యూస్, హైదరాబాద్: విమోచన దినోత్సవం నిర్వహించుకోవడం యావత్ తెలంగాణ ప్రజల హక్కు అని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) రాష్ట్ర ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు. గురువారం వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ సంస్థల ఆధ్వర్యంలో హైదారాబాద్ కోఠి బాలగంగాధర్ తిలక్ చౌరస్తాలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాల్లో నిజాం రజాకార్ల దోపిడీ పాలన సాగుతూ ఉండేదని గుర్తుచేశారు. 1948 సెప్టెంబర్ 17న అప్పటి భారత ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛావాయువులు పీల్చుకుందని గుర్తుచేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుంటే.. తెలంగాణలో మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ అమరవీరులను అవమానపరుస్తున్నారని విమర్శించారు.
ప్రధాని మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు
సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి, అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదినం కూడా కావడంతో వీహెచ్‌పీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి ఇంజనీరింగ్ వ్యవస్థను పరిచయం చేసిన విశ్వకర్మ చరిత్ర అనిర్వచనీయమన్నారు. 370 ఆర్టికల్‌ను రద్దుచేస్తూ కశ్మీర్ ను భారత్ లో అంతర్భాగం చేసి, చిరకాల సమస్యలు తీర్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రారంభించారు. అంతకుముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బజరంగ్ దళ్ భాగ్యనగర్ విభాగ్ ప్రముఖ్ ముఖేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. కార్యక్రమంలో భజరంగ్ దళ్ రాష్ట్ర కో కన్వీనర్ శివరాములు, విద్యానగర్ జిల్లా ప్రముఖ్ అఖిల్, వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నాయకులు రమణారెడ్డి, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, హరికృష్ణ, జగన్ పాల్గొన్నారు.