Breaking News

అక్షరం.. ఆరాధ్యదైవం

  • సవర జాతి గిరిజనుల విశిష్ట సంస్కృతి
  • ఒడిశా, ఆంధ్రా సరిహద్దుల్లో భాషా గుళ్లు

భాషకు రూపం అక్షరం. సరస్వతీ నమస్తుభ్యం..అంటూ అక్షరాభ్యాస వేళ గురువు రాయించే ‘అ..ఆ’లే మన జీవన గమనానికి , భాషా పాటవానికి తొలి అడుగు. అనంతర కాలంలో మనం అక్షరాన్ని దిద్దినా, ప్రేమించినా ఆరాధించడం అనేది ఓ భావనగానే కొనసాగుతుంటుంది. ఇందుకు భిన్నం శ్రీకాకుళం జిల్లా సరిహద్దులోని ఒడిశా రాష్ట్రం గుణుపురం సమీప మిర్చిగుడ, శ్రీకాకుళం జిల్లా భామిని మండలానికి చెందిన భామిని ప్రాంతాలకు చెందిన సవర జాతి గిరిజనుల తీరు. వారు అక్షరాన్ని ఆరాధిస్తారు. తమ భాషకు రూపమైన 24 అక్షరాలకు గుడికట్టి వాటినే దేవతలుగా పూజించడం విశేషం.. విలక్షణం. అక్షరబ్రహ్మగా సాగే ఈ భాషారాధన వెనక ఆసక్తికర కథనమే ఉంది.

ఆరు దశాబ్దాల క్రితమే అక్షరబ్రహ్మ ఆలయం
ఒడిశాలోని పద్మాపూర్‌సమితి దాంబుసారా మిర్చిగుడ వద్ద తొలి అక్షరబ్రహ్మ ఆలయం 1952లో వెలిసింది. దీనికి కారకుడు సవర భాషా పండితుడు మంగయ్యసవరో. మంగయ్య వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారి కాలంలోనే సవర భాషా వికాసానికి కృషిచేశారని చెప్పుకుంటారు. ఆయన 12 ఏళ్లపాటు పూరీ జగన్నాథుడికి తపస్సు చేసి స్వామి ఆశీస్సులతో వారి భాషా లిపిని కనుగొన్నారని కథనం.. ఆ మేరకు ఆయన సూచనలతో వెతికితే మిర్చిగుడకు సమీపంలో ఉన్న ఓ బండరాయిపై 24 అక్షరాలు కనిపించాయని వాటికి గుడి కట్టారని ప్రచారంలో ఉంది. ఈ గుడిని మంగయ్య కుమారుడు పరిరక్షిస్తున్నారు. మంగయ్య కృషికోసం ఒడిశా గెజిట్‌లో కూడా రాసి ఉండడం విశేషం. ఈ అక్షరాలకు ఆదివాసీ గిరిజనులు నిర్వహించే విత్తనాల పూజ (ఓకల్‌తర్జు)రోజు అంటే అక్షర తృతీయ నాడు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. వీటిలో ప్రధాన ఆరాధన అక్షర బ్రహ్మ, అనంతరం అక్షరాలకు జరుగుతుంటాయి.

వృత్తాకార గుడి.. హృదయాకార అక్షర మాలిక
ఈ అక్షర బ్రహ్మగుడి కూడా ప్రత్యేక శైలిలో ఉంటుంది. వృత్తాకారంలో ఉండే గుడిలోపల రాయిపై 24 అక్షరాలు ఉంటాయి. వాటినే గిరిజనులు తాము కొలిచే దేవతల ప్రతిరూపాలుగా భావిస్తారు. అవన్నీ కలిపితే మళ్లీ ఓ హృదయాకారంలో కనిపిస్తాయి. ఈ ముద్రనే అక్షరబ్రహ్మ సంప్రదాయం పాటించే గిరిజనులు తమ ఇంటి తలుపులుపైనా, వస్త్రాల పైనా, చివరికి నిత్యం వినియోగించే గ్లాసులు, కంచాలు, చెంబులపైనా ముద్రించుకుని ఎంతో పవిత్రంగా ఆ సామగ్రిని పరిరక్షించుకుంటారు. ఆయా గ్రామాల్లో ‘మత్తర్‌బనోమ్‌’ అనే సంస్థ అక్షరబ్రహ్మ ప్రచారాన్ని సాగించి పిల్లలకు ఈ భాషను బోధిస్తోంది. ఒడిశాలోని గణంత్రిలో ఈ భాషా ముద్రణ యంత్రం కూడా ఉంది. ఇక్కడే వారి పాఠ్యపుస్తకాలు ముద్రితమవుతాయి.
ఊతమిచ్చిన గిరిధరగొమాంగో..
అక్షరబ్రహ్మ సంప్రదాయం ముందుకు సాగడానికి ఒడిశా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ డప్పు కళాకారుడు, సాహితీ వేత్త గిరిధరగొమాంగో ఎంతో ఊతమిచ్చారు. ఈ సంప్రదాయంలో కొనసాగుతున్న వారికోసం ఆయన ప్రింటింగ్‌ప్రెస్‌లను ఏర్పాటుచేయించి వారు తమ పుస్తకాలు ముద్రించుకునే వెసులుబాటు కల్పించారు. ఇలా ఇప్పుడీ సంస్కృతి శ్రీకాకుళం , విజయనగరం జిల్లాలకు ముఖ్యంగా భామిని, మనుమకొండ, పాలవలస, సీతంపేట, ముత్యాలు, శంభాం, గుమ్మలక్ష్మీపురం, కన్నాయిగూడ ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందుతోంది.
మద్యం ముట్టరు.. మాంసం తినరు
అక్షరాన్ని ఆరాధించే ‘అక్షరబ్రహ్మ’ సంప్రదాయంలో కొనసాగుతున్న గిరిజనులు మద్యం ముట్టరు. మాంసం తినరు. ఆధ్యాత్మిక జీవనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వారి మాతృభాషా వ్యాప్తికి కృషి చేస్తుంటారు. అక్షర తృతీయ రోజున ఈ గిరిజనులు ‘అక్షరబ్రహ్మకు’ ఉత్సవాలు వేడుకగా జరుపుతారు. ఇక ఆ మందిరాల్లో నిత్యం అక్షర ఆరాధన భక్తిశ్రద్ధలతో సాగుతూ ఉంటుంది. ఇలా అక్షరాలకు ఆకృతినిచ్చి పీఠం వేసి పూజచేసే ఈ విశిష్ట సంప్రదాయం ఇతరవర్గాల వారినీ ఆకట్టుకుంటోంది. తెలుగు భాషా వికాసానికి కూడా ఆ సవర గిరిజనుల పట్టుదలను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు కుటుంబాల వారూ గట్టి సంకల్పం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల పాలకులు కూడా ఇందుకు తక్షణం నడుంకట్టాల్సిన ఆవశ్యకత ఉంది. పాలనా భాషగా తెలుగు పరిఢవిల్లేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

:: పట్నాయకుని వెంకటేశ్వరరావు,
సీనియర్​ జర్నలిస్టు
సెల్​: 97053 47880