Breaking News

సారస్వతమూర్తి సినారె

  • జూన్‌ 12న సినారె వర్ధంతి

‘చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు
నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు
కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు..’

మనిషిలోని చేతగానితనాన్ని ఎత్తిచూపారు సినారె..

విశ్వంభరుడు, మానవతా మహానీయుడు, ఆధునిక కవి, వక్త, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి, సుప్రసిద్ధ సినీగేయ రచయిత.. ఇలా ఎన్నో పేర్లతో పిలిచినా ఆయనకు తక్కువేనని చెప్పవచ్చు. ఆయనే మన సాహితీకోవిదుడు డాక్టర్​ సింగిరెడ్డి నారాయణరెడ్డి. అందరికి సినారెగా సుపరిచితులు. నాటి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజిపేట గ్రామంలో 1931 జులై 29న బుచ్చమ్మ, మల్లారెడ్డి దంపతులకు మొదటి సంతానం చనిపోవడంతో ఏకైక సంతానంగా సినారె జన్మించారు. ఆయన మొదటి పేరు సత్యనారాయణరెడ్డి. ప్రాచుర్యంలో సింగిరెడ్డి నారాయణరెడ్డిగా ముద్దుగా సినారెగా ప్రసిద్ధికెక్కారు. ఆయన సతీమణి పేరు సుశీల. ఈ దంపతులకు నలుగురు కూతుళ్లు. తన అభిరుచికి తగినట్టుగానే సాహిత్య ప్రవాహాన్ని తలపించేలా వారికి గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి అనే పేర్లు పెట్టారు. 30 ఏళ్ల క్రితమే సతీమణి చనిపోవ డంతో అనేక కష్టాలు భరించినా సాహితీ సాగరంలో నేటి ఆధునిక కవులకు సవాలుగా రచనలు చేశారు. ఆయన భార్య మరణాంతరం ఆమె పేరు మీద ‘సుశీల నారాయణరెడ్డి సాహిత్య పురస్కారాన్ని’ ప్రారంభించారు.
బాల్యం నుంచే కవిత్వంపై ఆసక్తి
సినారె ప్రాథమిక విద్య హనుమాజిపేట, నాలుగు, ఐదు తరగతులను వేములవాడ, ఆరు, ఏడు తరగతులు సిరిసిల్లా, ఎనిమిది నుంచి పదవ తరగతి వరకు కరీంనగర్‌లో చదివారు. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేశారు. ఉస్మానియాలో ఉర్దూ మీడియంలో బీఏ పూర్తి చేశారు. 1954లో ఉస్మానియాలో ఎంఏ తెలుగు చదివారు. తర్వాత ఆచార్య ఖండవల్లి లక్మీరంజనం పర్యవేక్షణలో ‘ఆధునికాంధ్ర కవిత్వం.. సంప్రదాయాలు.. ప్రయోగాలు’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందారు. సినారెకు చిన్నప్పటి నుంచి కవిత్వంపై ఆసక్తి ఎక్కువ. ఆరేడు తరగతుల వయసులోనే కవితలు రాసేవారు. అనేక జానపదాలు, హరికథలు, బుర్రకథలు వినిపించారు.
చేతగాని తనముంటే..
ఆయన తొలి రచన 1953లో ‘నవ్వని పువ్వు’ రాశారు. అనేక గేయ నాటిక, గేయ కవితలు, ఖండకావ్యాలు, కవితా సంపుటాలు, విశిష్ట కావ్యాలు, వ్యాస సంపుటాలు, దీర్ఘకావ్యాలను రాశారు సినారె. ‘విశ్వంభర’ అనే సమగ్ర వచన కావ్యానికి 1988లో జ్ఞానపీఠ అవార్డు పొందిన ఆధునిక మహాకావ్యం. ‘మంటలు.. మానవుడు’ అనే కవితా సంపుటానికి 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. బౌద్ధకథగా నాగార్జున సాగరం పేరొందిన కథాకావ్యం. మాత్రాఛందస్సుకు ప్రాణం పోసిన గేయకావ్యం కర్పూర వసంతరాయలు. ఎనలేని ఖ్యాతి పొందిన రచన అది. ‘మధ్యతరగతి మందహాసం’ అనే కవితా సంపుటి వచన కవిత్వాన్ని బలోపేతం చేసింది. ‘ప్రపంచ పదులు’ వంటి విశిష్ట కావ్యాలను రాశారు. ‘చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు.. నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు.. కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు..’ అంటూ ప్రపంచపదుల్లో చెప్పిన కవిత్వం అద్వితీయం. ‘మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది.. మనసుకు మబ్బె ముసిరితే కన్నీరవుతుంది..’ అని గజల్‌లో చెప్పిన కవితలు నేటికీ ఆదర్శవంతంగా నిలుస్తున్నాయి. ఊపిరి ఉన్నంత వరకు ఆయన కవితావాహిణి ఆగలేదు.
కలం, గళం.. అస్త్రాలు
1981లో ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, 1985లో డాక్టర్​ బీఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడిగా, 1989లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడిగా, 1993లో ఆంధ్రప్రదేశ్‌ సరస్వతి పరిషత్​ అధ్యక్షుడిగా ఇలా ఎన్నో పదవులను అలంకరించిన సాహిత్య కుందనం సినారె. సినీప్రస్థానంలో 1962 నుంచి సినీపాటలు రాయడం మొదలు పెట్టారు. ‘గులే బకావళీ’ కథ సినిమాలో ‘నన్ను దోచుకుందువటే.. వన్నెల దొరసాని’ అనే పాటతో పాటు ఆ సినిమాకు అన్ని పాటలు రాశారు. ‘అరుంధతి’, ‘మేస్త్రీ’ సినిమాల వరకు మొత్తం మూడువేల పాటలు రాశారు.
గున్నమామిడీ కొమ్మమీద.. గూళ్లు రెండున్నాయి
పగలే వెన్నెలా.. జగమే ఊయలా
వస్తాడు నా రాజు ఈరోజు..
అమ్మను మించి దైవం ఉన్నదా..
కంటేనే అమ్మ అని అంటే ఎలా..
జేజెమ్మా.. మాయమ్మ

.. అంటూ సాగిన అద్భుత పాటలు సినారె కలం నుంచి జాలువారినవే.
అవార్డులు.. పురస్కారాలు
జ్ఞానపీఠ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు చాలా అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. 1977లో పద్మశ్రీ, 1992లో పద్మ భూషణ్‌ పురస్కారం అందుకున్నారు. రాజ్యలక్ష్మి పురస్కారం, సోవియట్‌ నెహ్రూ పురస్కారం, కళాప్రపూర్ణ, సినీకవిగా నంది పురస్కారం, పలు యునివర్శిటీల నుంచి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు. 2014లో జీవన సాఫల్య పురస్కారం కూడా పొందిన మహాకవి సినారె. ఆయన సాహితీకీర్తిని చాలా మంది కవులు కొనియాడారు. ఆయన అనారోగ్యంతో 86 ఏళ్ల వయసులో 2017 జూన్‌ 12న తుదిశ్వాస విడిచారు. ఆయన మన మధ్య లేకున్నా ఆయన రచనలు, సినిమా పాటలు, కావ్యాలు, గ్రంథాలు పదిలంగా ఉన్నాయి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సారస్వతమూర్తి సింగిరెడ్డి నారాయణరెడ్డి. ఆయన కవిత్వం, ఆయన జీవితం, ఆయన ఆదర్శం నేటి, రేపటి తరానికి స్ఫూర్తిదాయకం.