న్యూఢిల్లీ: వన్డేల్లో ఫలితం తేల్చడానికి సూపర్ ఓవర్ ఎందుకు వేయించాలని న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్మెన్ రాస్ టేలర్ అభిప్రాయపడ్డాడు. ఫైనల్ మ్యాచ్ టై అయితే ట్రోఫీని ఇరుజట్లకు పంచండని సూచించాడు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ను దృష్టిలో పెట్టుకుని టేలర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
50 ఓవర్ల ఫార్మాట్లో సూపర్ ఓవర్ ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మ్యాచ్ టై అయితే దానిని టైగానే పరిగణించాలి. వేగంగా పరిస్థితులు మారే టీ20ల్లో ఇది కుదరకపోవచ్చు. ఫుట్బాల్ మాదిరిగా టీ20లకు కచ్చితమైన ఫలితం రావాలి కాబట్టి అక్కడ సూపర్ ఓవర్ పెట్టండి. కానీ వన్డేలకు అక్కర్లేదు. దీనికి బదులుగా టై అయితే రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటించండి. ఇంగ్లండ్ ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత ట్రోఫీ ఇద్దరికీ ఇస్తారనుకున్నా. కానీ అంపైర్లు సూపర్ ఓవర్ గురించి చెబితే షాకయ్యా. ఒక్క ఓవర్లో ఫలితాన్ని తేల్చడం చాలా అన్యాయం’ అని టేలర్ అభిప్రాయపడ్డాడు.