బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఎవర్టన్ వీక్స్ (95) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆరునెలల క్రితం తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకున్న ఆయన వృద్ధాప్య సమస్యలోనే తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. 1925లో బార్బడోస్‌లో పుట్టిన వీక్స్.. 1947–58 మధ్యకాలంలో విండీస్ తరఫున 48 టెస్టులు ఆడాడు. 58.61 సగటుతో 4,455 పరుగులు సాధించాడు. ఇందులో 15 శతకాలు, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 1948లో.. 22 ఏళ్ల వయసులో ఇంగ్లండ్(కింగ్స్టన్ ఓవల్)పై టెస్ట్ అరంగేట్రం చేసిన వీక్స్.. దశాబ్దం తర్వాత పాకిస్థాన్ (ట్రినిడాడ్)పై చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అప్పటి విండీస్ కెప్టెన్ జార్జ్ హెడ్లీ స్థాయిలో 58.61 సగటు సాధించిన వీక్స్.. ఆల్‌టైమ్ టాప్–10 జాబితాలో చోటు సంపాదించాడు. 1948లో వరుసగా ఐదు శతకాలతో వీక్స్.. ప్రపంచ రికార్డు నెలకొల్పారు. జమైకాలో ఇంగ్లండ్‌పై 148 పరుగులు చేసిన ఆయన.. భారత పర్యటనలో వరుసగా 128, 194, 162, 101 పరుగులు సాధించాడు. చెన్నైలో జరిగిన చివరి మ్యాచ్‌లో 90 పరుగుల వద్ద రనౌట్ కావడంతో ఆరో శతకాన్ని తృటిలో కోల్పోయాడు.
‘త్రీ డబ్ల్యూఎస్’ లేరు
సర్ ఫ్రాంక్ వోరెల్, సర్ క్లైడ్ వాల్కట్, ఎవర్టన్ వీక్స్‌ను.. విండీస్ క్రికెట్లో ‘త్రీ డబ్ల్యూఎస్’గా పిలుస్తారు. ఈ ముగ్గురు 1948లోనే టెస్ట్ అరంగేట్రం చేయడం మరో విశేషం. అయితే 1967లో వోరెల్ మృతి చెందగా, 2006లో వాల్కట్ కన్నుమూశారు. ఈ త్రయంలోచివరి వాడైన వీక్స్ లోకాన్ని వీడడంతో త్రీ డబ్ల్యూఎస్ శకం ముగిసింది. ఈ ముగ్గురు కలిసి 39 సెంచరీలు కొట్టడం గమనార్హం. కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వీక్స్ క్రికెట్లోనే ఎక్కువగా గడిపారు. కోచ్‌గా, రెఫరీగా, టీమ్ మేనేజర్‌గా, ఎనలిస్ట్‌గా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. వీక్స్ సేవలకు మెచ్చిన ఐసీసీ ప్రతిష్టాత్మక ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు కూడా కల్పించింది. ఓవరాల్‌గా 1994లో మూడు టెస్టులు, నాలుగు వన్డేలకు మ్యాచ్ రెఫరీగా పనిచేశారు. వీక్స్ మృతిపై ఐసీసీ, విండీస్ క్రికెట్ బోర్డుతో పాటు సచిన్, రిచర్ట్స్లాంటి క్రికెటర్లు సంతాపం ప్రకటించారు. వీక్స్‌కు సంబంధించి ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని క్యాబ్ ప్రకటించింది.