Breaking News

అంతర్యామి.. ఆంతర్యమేమీ..!

అంతర్యామి.. ఆంతర్యమేమీ..!
  • శ్రీవారిని నిలదీస్తున్న కుబేరుడు..

ఎప్పటి మాదిరిగానే స్వామివారికి పవళింపు సేవ పూర్తయ్యింది. ఆలయం తలుపులను ఒకటికి పదిసార్లు చూసుకున్న అర్చకస్వాములు.. మళ్లీ సుప్రభాత సేవలో కలుద్దాం స్వామీ..అంటూ వెళ్లిపోయారు..

ఒంటరిగా ఉన్న వేంకటేశునికి..కంటిమీదకు కునుకు రావడం లేదు..అమ్మవార్లు కూడా ఇన్నేళ్లుగా అలసిపోయి ఉన్నారేమో వారూ..కాస్త దూరంగా నిద్రలోకి జారుకున్నారు…

సరే తిరుమలలో పరిస్థితి ఏమిటో చూద్దామన్న కుతూహలం స్వామికి కలిగింది..అలా బంగారు వాకిలి వద్దకు దివ్యమార్గంలో వచ్చారు. అడవి కీచురాళ్ల శబ్దాలు..నిర్మల ప్రకృతి.. దూరంగా వారికి కేటాయించిన పోస్టుల్లో తుపాకులతో విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కనిపించారు. అలా మాడవీధుల వైపు ఓ సారి చూస్తే అక్కడ రెండు పులులు విశ్రాంతిగా పడుకున్నాయి. కృష్ణసర్పం ఒకటి పడగవిప్పి గుడిముంగిట ఆడుకుంటోంది.

భక్తుల కోలాహలం లేదు. రాత్రనక, పగలనక వినిపించే గోవిందనామస్మరణ లేదు. తన సేవలో రోజూ తరించే గజరాజులు తాపీగా తొండాలు ఊపుకుంటూ కనిపించాయి..మావట్ల జాడ లేదు…

పోనీలే అలివేలుమంగమ్మను, పద్మావతిని పిలచి కాసేపు విహరిద్దామంటే … ఒక్కసారి పుడమిని ఏలుతున్న ప్రభుత్వాలు.. విధించిన కరోనా.. ఆంక్షలు గుర్తుకు వచ్చాయి. తాను ఎంత దేవదేవుడైనా వైకుంఠంలో చెల్లుబాటు అవుతుందేమో గానీ భూలోకంలో ఉంటూ ఇక్కడి చట్టాలను గౌరవించక పోతే ఏంబావుంటుందీ అని మనసులోనే అనుకొని..

వారిని పిలిచే ఆలోచనను విరమించాడు..అప్పటికీ తాను ఆంక్షలను అధిగమించి గుడివాకిలి దాటి రావడమే.. తప్పు కాబట్టి..కొంత తమాయించుకొని పుష్కరిణివైపు వెళ్లాడు..ఎందుకో కలవరంగా ఉంది..వందల ఏళ్లుగా తాను సాగించిన విధులేమిటీ..ఇప్పుడీ కొత్త ఇబ్బందులేమిటీ..తనను కనులారా చూసుకొని మురిసిపోయే భక్తులు రాలేని దుస్థితి ఏమిటీ..

ఎన్నో ప్రశ్నలు..ఎవరు దీన్ని తీరుస్తారు..సృష్టికర్త బ్రహ్మ.. లయకారుడు శివుడా..తానైతే పాలకుడు మాత్రమే…ఇన్ని అవతారాలు ఎత్తినా ఎక్కడా ఏ యుగంలోనూ ఇలాంటి సంక్లిష్టత ఏర్పడలేదు..

ఇంతలో..‘ వెంకన్న పాదాలు నే..చూడలేను..’పాట చెవిన పడింది..ఒక్కసారి అంతటమూర్తీ చలించిపోయాడు. ఇంతటి క్లిష్టస్థితిలో కూడా..ఓ భక్తుడు నాకోసమా…అను కొని ఆ దిశగా చూశాడు…

అక్కడ వరాహస్వామి ఆలయం వద్ద ఎవరో కదుల్తున్నట్లూ..తనవైపే వస్తున్నట్టూ గమనించాడు..పెద్ద పొట్టతో..

నల్లగా ఉన్న ఆకారం..చేతిలో ఏదో మెరుస్తోంది..‘వచ్చిన వాడు..స్వామి తేరుకునేలోగానే.. నమస్కరించాడు..ఓ నువ్వా కుబేరా…పాట కూడా నీదా అని అడిగినా..అతని రాక ఆంతర్యం అంచనా వేస్తున్నాడు..

తిరుమలేశుడు..’ నాది కాదు స్వామీ మీలాగే క్వార్టరులో నిద్రపట్టని నీ దేవస్థానం ఉద్యోగి..వేసిన పాట..’ అని కుబేరుడు చెప్పాడు.

ఓహో..అలానా..అవును స్వామి..కొండమీద నీ పాటలు తప్పా ఇంకేవీ ఉండకూడదు కదా..అందుకే నీ నామస్మరణ చేస్తున్నాడు…అని బదులిచ్చాడు..
ఓ చిరునవ్వు నవ్విన స్వామి ..

ఇంతకీ నీ రాక ఎందుకో కుబేరా..అసలే ఇక్కడి పరిస్థితులు బాగులేవు..ఒక వేళ నువ్వు మా భద్రతా సిబ్బందికి కనిపిస్తే..నిన్ను బంధించి రోగరక్షిత కేంద్రానికి తరలిస్తారు..జాగ్రత్త సుమీ అని అన్నాడు..లేదు స్వామీ అందుకే నువ్వు ఏకాంతంగా తిరుగుతున్నప్పుడే ఇలా వచ్చాను…అన్నాడు..ఇక తప్పదన్నట్టుగా విషయం చెప్పు కుబేరా అన్నాడు..స్వామి.. కుబేరుడూ వెంకన్న మొహం చూసే సాహసం చేయలేక..తన చేతిలో ఉన్న తామ్రఫలకం వైపు చూస్తూ…

అదే..స్వామీ..అంటూ నసిగాడు..వడ్డికాసుల వానికి సీన్‌ అర్థమయ్యింది. సుమారు నెల దాటింది. భక్తుల జాడ లేదు..వారు తన్మయత్వంతో మొక్కే మొక్కులు లేవు. పరకామణి వద్ద సందడే లేదు. హుండీ మూట గాలికి ఉయ్యాలలా ఊగుతోంది. ఇక తన పేరిట జరిగే అన్నప్రసాద దానం, లడ్డూల ప్రసాదాల తయారీ, అప్పాలు, చక్కెరపొంగళి, వంటివి కేవలం తనకు నిత్యకృత్యంగా సాగే పూజల్లో చూపించి అర్చకులు మమ అనిపిస్తున్నారు. అప్పటిలోలా పోటు వద్ద ..హడావుడే లేదు. తనకు బాలభోగం, మధ్యాహ్న భోగం వంటివి సాగించి…గంట వాయించేస్తున్నారు..తాను కూడా మొహమాటంతో గత నెలరోజులుగా కాలక్షేపం చేసేస్తున్నాడు.

ఇక ఉత్సవాలు, ఊరేగింపులు, మాడవీధుల్లో హంగామా కానరావడం లేదు. రోజూ వినిపించే కళ్యాణ మంత్రాలు, అందులో పరవశించే భక్తుల తాకిడి చూసి ఎన్నాళ్లయ్యిందీ…కాటేజీలన్నీ బోసివోయి..ఉన్నాయి. ఇలా ఈ నెలలో రూ.300కోట్లకు పైగా రాబడి పడిపోయింది. అవన్నీ తన పేరిట కొన్ని వందల ఏళ్లుగా భక్తులు, పాలకులు సాగిస్తూ ఉంటే..తనకూ గట్టి భరోసా ఉండేది.

అప్పుడెప్పుడో..కుబేరుని వద్ద పెళ్లికోసం తీసుకున్న అప్పు..ఉఫ్‌ మనీ తీర్చేయనా అని..వాటి లెక్క తేల్చలేకే కదా…తన తమ్ముడు గోవిందరాజులు అలసిపోయి కుంచం మీదే పడుకుండిపోయాడు. దిగువ తిరుపతిలో తన పరిస్థితి ఏమిటో..అటువైపు తిరుచానూరులో అమ్మవారు సైతం..

భక్తులు కానరాక తల్లడిల్లుతోందట. ఎంతైనా తల్లి మనసు కదా…ఇలా ఆలోచనలు చుట్టుముడుతుంటే…కుబేరుడు మధ్యలో వచ్చి అప్పుసంగతి గుర్తు చేస్తున్నాడు..మాటతప్పలేని స్వామికీ ఈ వ్యవహారం కాస్త చికాకుగా ఉంది. ‘ఏం కుబేరా..భూలోక చట్టాల ప్రకారం నువ్వు అప్పును వాయిదా వేసుకోవయ్యా..

ఇప్పుడు వచ్చి పీకలమీద కూర్చుంటే ఎలా..నన్ను ఇంతవాడిని చేసిన నా భక్తులే..ఇళ్లల్లో మగ్గుతూ..ఎక్కడున్నావూ..అంటూ నాకోసం పాడుతున్నారు. కొందరైతే ఇంకా ముందుకెళ్లి..‘ఉన్నావా..అసలున్నావా’ అంటూ గట్టిగానే నిలదీస్తున్నారు…ఇలాంటప్పుడు నువ్వు వచ్చి…అప్పు తీరుస్తానో లేదో అనే మతలబు పెడితే ఎలా…అని ప్రశ్నించాడు. అయినా లక్ష్మి ఎప్పుడూ నా హృదయంలోనే ఉంటుంది కదా..నీకెందుకు సందేహం…

అన్నాడు..’కుబేరుడు గొంతు సవరించుకొని..అవును స్వామీ అమ్మవారు ఎప్పుడూ మీ హృదయ పీఠంపై ఉంటారనే నమ్మకంతోనే కలియుగం చివరికైనా నువ్వు నా పద్దు తేలుస్తావన్న ధైర్యంతో ఇన్నేళ్లూ కాలక్షేపం చేశా.. ఇప్పుడీ భూలోకాన్ని చుట్టిన ‘కరోనా’ మహమ్మారి మా అమ్మను..నీ దగ్గరనుంచే కాదు..

జనం అందరినుంచీ దూరం కాబోతోంది. కొన్నాళ్లకు..పేదా,పెద్దా, బీదా, బిక్కీ తేడా లేకుండా..సమాన స్థాయిలో నిలుచునే పరిస్థితి రావచ్చని తెలుస్తోంది. అలాంటప్పుడు అమ్మ.. బిడ్డల సంగతి చూస్తాదా..

నీకు తోడుగా ఉంటుందా.. ఆలోచించు.. ఇప్పటికి ఉన్నదాంట్లో ఎంతోకొంత సర్దు… ఆ తర్వాత మళ్లీ లెక్కలు తేల్చుకుందాం..’అని కాస్త ధైర్యంగానే అన్నాడు. వెంకన్నకు ఈ లాజిక్‌ అర్థమయ్యింది…ఏదో విధంగా అప్పుకోసం హామీ కోరడమో..ఉన్నదాంట్లో కొంత ఇమ్మని అడగడమో ఇతని ఎత్తుగడ లాగుందని గుర్తించి…

అంతర్ముఖుడయ్యాడు. వెంటనే బ్రహ్మా, మహేశ్వరులు అక్కడికి చేరారు. దూరంగా ఉన్న గరుడుడు ఎందుకైనా మంచిదని స్వామికి దగ్గరగా వచ్చి..

కుబేరుని వైపు ఓ కన్ను వేసి గమనిస్తున్నాడు. ద్విమూర్తుల రాకతో తేరుకున్న శ్రీనివాసుడు వారికి ప్రణామం చేశాడు…తొలుత బ్రహ్మే అందుకొని ‘ వేంకటేశా నీ స్థితి అర్థం అయ్యింది…ఈ కుబేరుని సందేహం ధర్మబద్ధంగానే ఉంది. మనం పాలకులం కాబట్టి..చెప్పిందీ, చేసిందీ ఒకేలా ఉండాలి..

అని అంటూంటే..ఇదేమిటీ బ్రహ్మ వచ్చి ఆదుకుంటాడంటే ఇలా తనకే కర్తవ్య బోధ చేస్తున్నాడని..కాస్త గుండె చివుక్కుమన్నా…నిజం నిష్టూరమే కదా అనుకొని సర్దుకున్నాడు. శివుని వైపు చూశాడు..సప్త గిరీశా..నీకు నా సంగతి తెలుసు కదా..‘నేను శ్మశానవాసిని. తిరుపమెత్తుకునే జంగమయ్యను.

నీలాగా పట్టు పీతాంబరాలు, రాజభోగాలు నాకు వర్తించవు. శ్మశాన భస్మంతో అర్చన చేసినా చాలు సంతోషించి..వరాలు కుమ్మేసే వాడిని..సమస్య వస్తే మీరిరువురే ఏదో ఒకటి చేసి ఒడ్డెక్కించడం అలవాటు..అందుకే భోళాశంకరుడు, తిక్కశంకరుడు, బూడిదిచ్చేవాడు..ఇలా నన్ను అనేక రకాలుగా పిలుస్తారని నీకూ తెలుసు. ఇక సృష్టిని లయం చేసుకోవడమే నాకు తెల్సిన విద్య..

ఇప్పుడు భూలోకానికి చుట్టిన మహమ్మారితో నాలో లయం అవుతున్న వారితోనే నేను సతమతమవుతున్నాను..ఇక నేను నీకు ఏ విధంగా సాయం చేయగలనూ’ అని రివర్స్‌లో వచ్చాడు..వెంకన్నకు నోట మాటరాలేదు.

అలాగని మాటా తప్పలేడు. తనకు గుర్తున్నంత వరకూ తాను మాట్లాడింది..శ్రీనివాసుడుగా పెళ్లయిన కొత్తలోనే. అదీ అత్తింటి వారు తగవులు పడుతుంటే గుడికట్టించిన తొండమానునికి ఫేవర్‌గా ఏదో కొంత చేశాడు. ఆ తర్వాత విగ్రహంగా మారి నిగ్రహంగా వచ్చే వారిని అదృశ్యరూపంలో ఆశీర్వదించడం తప్పా..వేరేదేమీ లేదు. తనంతట తాను ఈ వేడుకలు, భోగాలు, ఉత్సవాలు, పారువేటలు, కల్యాణాలు..కోరలేదు. అడక్కుండానే అందరూ ఇస్తుంటే..తానూ ఊరుకున్నాడు…

అలా నమ్మికా పెరిగిందీ..సంపదా పెరిగింది. ఎప్పుడో 500 ఏళ్ల కిందట అన్నమయ్య మనసు కరిగిస్తే..ఏదో పదాలే కదా అని మురిసిపోయి..ఓకే అని మోక్షం ఇచ్చాడు.త్యాగరాజు అలాగే పాటతో పొంగిస్తే..

తెరను తెంపి చూసుకో అన్నాడు..అంతకు మించి కొండగీసిన గీటుగాని, భక్తులు విధించిన ఆంక్షలుగానీ దాటలేదు. అంతా వారే అనుకొని..వారే రకరకాల సేవలు చేసి..మురిపించి..తననూ మైమరిపించేలా చేశారు. ఓ ఇల వైకుంఠమై తిరుమల నిలచింది. ఏదో ఒకసారి హథిరాంతో పాచికలాడి..

తన వద్ద ఉన్న వస్తువులను ఓడిపోతేనే..పెద్ద సంఘటనగా మారి ఆ భక్తుని పీకకు చుట్టుకుందీ..ఇప్పుడేమిటీ కర్తవ్యం..అని స్వామి తర్జభర్జన పడి కుబేరుని వైపు తీక్షణంగా చూడబోయాడు..ఇలాంటి అనుభవాలు అప్పిచ్చువానికి తెలీదా అని ముందే పసిగట్టిన కుబేరుడు..ఆ మేఘశ్యాముని కళ్లు ఎరుపెక్కి..

మెరుపుల్లాంటి ఆగ్రహ జీర కనిపించే లోపే బ్రహ్మపాదాలపై పడి..తనకు వరాహస్వామి సమక్షాన రాసిచ్చిన ఎగ్రిమెంట్‌ ఫలకం చూపించాడు. బ్రహ్మ పరిస్థితి అంచనా వేసి..తాను సృష్టించిన విశాల ప్రకృతికి ‘కరోనా’పట్టి ఎలాంటి దుస్థితి వచ్చింది కదా..అది కూడా తమ ఉనికిని నమ్మని భూ ప్రాంతంనుంచి పాకింది కదా అని చతుర్ముఖాలతో ఆలోచించాడు..అతనిలోని సరస్వతి ప్రత్యక్షమై వారి సంకట స్థితిని గమనించింది. వీణ మీటి..బ్రహ్మకు ఆలోచనలో సాయం చేసింది. దాంతో బ్రహ్మ..తిరుమలేశుని చూసి..‘స్వామీ..నీ పరిస్థితి ఇబ్బంది కరమే..

అలాగని కుబేరుని అప్పూ..కాదనలేం..ఇది మన అందరి సమస్య. అంతకు మించి భక్తులకు ఏర్పడిన దుర్భరత నుంచి నీకు సంక్రమించిన విపత్కర స్థితి. నువ్వూ కళావిహీనుడవయ్యావు. ఇన్నేళ్లూ..మందిరానికే పరిమితమైన నువ్వు.. భక్తుల మనస్సుల్లోకి వెళ్లు..వారిలో శక్తిని నింపు..అసలు వారిలోనే నువ్వు…కాదు..కాదు..వారికీ నీకూ తేడా లేదు. ప్రతీ ఒక్కరిలోనూ దైవత్వం అంటే వారి శక్తియుక్తులే..వారు తమ అంతర్గత శక్తిని విడచి..దాన్ని బయటకు తోసేసి ఇలా గుడుల్లో వెతుక్కుంటారు. కొంతమంది అందుకే నీకు రూపం లేదన్నారు. కొంతమంది దాన్ని సృష్టించి.. పూజలు, ఉత్సవాలు, వేడుకలు ఒక్కటేమిటీ ఎన్నో అలవాటు చేసేశారు.

నువ్వూ ఆ భక్త భజన లేనిదే..ఆ నామస్మరణ లేనిదే ఉండలేని పరిస్థితికి తెచ్చారు. మళ్లీ అంతా సర్దుకోవాలంటే.. మనిషి తన మీద తాను నమ్మకం పెంచుకోవాలి…వారికి సేవలందిస్తున్న వారిలో దైవత్వాన్ని చూసుకోవాలి. సమాజమంతా తన సహజస్థితిని తెలుసుకునేందుకే ఈ విపత్తు వచ్చింది. దీనికీ నా వద్దా సమాధానం లేదు. నీలాగ నాకు గుడులూ,గోపురాలు లేవు కాబట్టి కాస్తంత ఫ్రీ..ఇక శివుడంటే..

మనిషి చివరి యాత్ర ఆయన వద్దకే అంటే మరుభూమికే కాబట్టీ అతనిదీ బేఫికరే. నీదే పాలకుని స్వభావం కాబట్టి..కొన్ని సర్దుకోలేక పోతున్నావు..అప్పుడెప్పుడో హథిరాంబాబాకు ఇచ్చినట్టు ఇప్పుడు కుబేరునికి నీ వద్ద ఉన్నవి ఇచ్చే ప్రయత్నం చేయకు..మళ్లీ కొత్త వివాదానికి దారితీస్తుంది. అసలు అవి కూడా నీవి కావు..భక్తులు ప్రేమతో సమకూర్చినవే. అవి నీకు అనుభవయోగ్యమే కానీ..

ఇతరులకు ఇచ్చే హక్కుకు నోచుకోనివి… ముందుగా కొండ కదులు..మనుషుల గుండె కదిలించు..వారి శక్తిని వారికే తెలిసేలా చెయ్యి. సంకల్పానికి మించిన బలం లేదని..అసలైన భక్తులు అదే చెప్పారనీ వారికి తెలిసేట్టు చెయ్యి..అన్నీ సర్దుకుంటాయి..మళ్లీ ప్రకృతి పరవశించేలా మనిషి జీవనం సాగించమను. కొత్త జీవిత పాఠాలు నేర్చుకొని శక్తిమంతునిగా మారమను. అప్పుడు..

నీకు ఈ సమస్య పరిష్కారమవుతుంది. కొండ మళ్లీ నీ స్మరణతో మోగుతుంది. నీకూ..భక్తునికీ మధ్య..వున్న అడ్డంకులు తొలగించు..అంతర్గత శక్తులను మేల్కొల్పేలా ప్రయత్నించు..’అని బ్రహ్మ ముగించేలోగా..అంతర్యామికి అసలు ఆంతర్యం అర్థమయ్యింది.. ఆలయంనుంచి ‘కౌసల్యా సుప్రజా..’అన్న పిలుపు వినిపించింది…

అంతా అంతర్థానమయ్యారు..‘ స్వామీ.. శ్రీనివాసా ’ అని సెక్యూరిటీల రెస్ట్‌రూంలో కేకలు వేస్తున్న గార్డు గణేశ్‌ను సహగార్డు తట్టి లేపాడు.. తుళ్లిపడి అతను లేచి ఓహో కలా..అని తనలో తానే నవ్వుకుంటూ ..విధులకోసమని లేచి వెళ్లిపోయాడు..

– పట్నాయకుని వెంకటేశ్వరరావు,
9705347880, 9704772790

(ఇదంతా కల్పిత గాధ, కేవలం ప్రస్తుత పరిస్థితుల్లో మనలోని శక్తిని తెలిపేందుకు ఊహించి రాసిన కథనం. ఇది దైవత్వాన్ని, మతాన్ని కించపరిచేది కాదు.దైవమంటే మనలోనే ఉంటాడు అని చెప్పే ప్రయత్నం. అది మనిషి సృష్టే అని ఎరుక పరచడం ఉద్దేశం. సంకల్పసిద్ధిరస్తు…అందరికీ కరోనాపై విజయోస్తు)

One thought on “అంతర్యామి.. ఆంతర్యమేమీ..!”

  1. సూపర్ సార్ నైస్ ఆర్టికల్

Comments are closed.