Breaking News

షూస్​ లేక మ్యాచ్​ ఆడలే


న్యూఢిల్లీ: చిన్నతనంలో ఆర్థిక కష్టాలు ఎదుర్కొవడంతో.. తన కెరీర్ ఆలస్యంగా మొదలైందని టీమిండియా స్టార్ పేసర్ ఉమేశ్ యాదవ్ అన్నాడు. కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందులు పడ్డానన్నాడు. స్పైక్ షూస్ లేవనే కారణంతో ఓ కోచ్ మ్యాచ్ ఆడనివ్వలేదని గుర్తుచేసుకున్నాడు. ‘నా కెరీర్ చాలా ఆలస్యంగా మొదలైంది. కార్క్ బాల్​తో క్రికెట్ ఆడతారని టీవీల్లో మాత్రమే చూశా. దానిని పట్టుకోవడానికి చాలా సమయం పట్టింది. బయట క్రికెట్​ లో నేను యార్కర్లు అద్భుతంగా వేస్తుండడాన్ని ఒకాయన గమనించాడు. అలా నాగ్​పూర్​ జిల్లా జట్టుకు ఆడే అవకాశం కల్పించాడు. అక్కడ 8 వికెట్లు తీయడంతో ఓ సారి సమ్మర్ క్యాంప్​నకు పిలిచాడు. కానీ నాకు స్పైక్ షూస్ లేకపోవడంతో అక్కడి కోచ్ నన్ను మ్యాచ్ ఆడనీయలేదు. దాంతో క్రికెట్ వదిలేద్దామనుకున్నా. కానీ నా స్నేహితులు సర్ది చెప్పడంతో మరింత ఎక్కువగా ప్రాక్టీస్ చేసి ఒక్కో అడుగు ముందుకేశా’ అని ఉమేశ్ వెల్లడించాడు.
లక్ష్మణ్, ద్రవిడ్​తో ఆడడం కలిసొచ్చింది
ఓసారి దులీప్ ట్రోఫీలో లక్ష్మణ్, ద్రవిడ్​తో ఆడడం తనకు బాగా కలిసొచ్చిందని ఉమేశ్ వెల్లడించాడు. ‘ఈ విషయం తెలిసి తొలుత చాలా భయపడ్డా. చిన్నపిల్లాడిని ఇబ్బందులు పెడతారా? అని టీమ్ వాళ్లను ప్రశ్నించా. కానీ వాళ్లు మాత్రం నా మంచే కోరారు. ధైర్యం చెప్పి బౌలింగ్ ఇచ్చారు. ఆ మ్యాచ్​లో ఐదువికెట్లు తీశా. ద్రవిడ్, లక్ష్మణ్​ను కూడా ఔట్ చేయడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు’ అని ఉమేశ్ వ్యాఖ్యానించాడు. నడి వేసవిలో రోజుకూ మూడు మ్యాచ్​లు ఆడి.. దానివల్ల వచ్చిన డబ్బులతో క్రికెట్ కిట్ కొనుకున్నానని చెప్పాడు. నాగ్​పూర్​లో ఎంత ఎండ ఉన్నా.. తాను మాత్రం బరిలోకి దిగేవాడినని పేర్కొన్నాడు. అలా చాలా కిందిస్థాయి నుంచి ఇప్పుడున్న స్థితికి చేరుకున్నానని ఈ నాగ్​పూర్​ బౌలర్ వెల్లడించాడు. ఒకవేళ జట్టులో చోటు కోల్పోయినా ఇప్పుడు ఇబ్బంది పడనన్నాడు. అందుకే భవిష్యత్​పై అసలు బెంగ పెట్టుకోవడం లేదని ధైర్యంగా చెప్పాడు.