Breaking News

విమాన టికెట్ల బుకింగ్ షురూ

మే 3వ తేదీ తర్వాత లాక్ డౌన్ ను మరోమారు పొడిగించక పోవచ్చన్న సంకేతాలు అందడంతో శనివారం నుంచి విమాన ప్రయాణాలకు టికెట్ల బుకింగ్ మొదలయ్యాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితులు చక్కబడితే 4వ తేదీ నుంచి దేశీయ ఎయిర్ పోర్టుల నుంచి విమానాలు బయలుదేరుతాయని దాదాపు అన్ని పౌర విమానయాన సంస్థలూ ప్రకటించాయి. ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా మాత్రం, తాము ఎంపికచేసిన రూట్లలోనే పరిమితంగా సర్వీసులు నిర్వహిస్తామని పేర్కొంది. విదేశీ సర్వీసులు కూడా నడుపుతామని, అయితే, విదేశీ ప్రయాణికులు, తప్పనిసరిగా ‘ఫిట్ ఫర్ ఫ్లయ్’ సర్టిఫికెట్ ను సమర్పించాలని సూచించింది. కాగా, ఈనెల 14 తర్వాత విమానాలు నడిపించేందుకు నిర్ణయించిన కొన్ని సంస్థలు ముందస్తుగా టికెట్లను విక్రయించి, ఆపై సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్ డబ్బును వెనక్కు ఇవ్వలేమని, దానికి బదులుగా ప్రయాణ తేదీని మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామని ఎయిర్ లైన్స్ చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.