సారథి న్యూస్, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్ ను వినియోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. బుధవారం సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు అంశాలపై చర్చించింది. అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించింది. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణపై కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది.
టీఎస్ బీపాస్ పాలసీకి ఆమోదం
భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టీఎస్ బీపాస్ పాలసీని మంత్రివర్గం ఆమోదించింది. టీఎస్ ఐపాస్ లాగానే టిఎస్ బీ పాస్ కూడా అనుమతుల విషయంలో పెద్ద సంస్కరణ అని కేబినెట్ అభిప్రాయపడింది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు కరెంట్బిల్లులను ప్రతినెలా క్రమం తప్పకుండా చెల్లించాలని కేబినెట్ ఆదేశించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. పంచాయతీలు, మున్సిపాలిటీలు గతంలో ఉన్న విద్యుత్ బకాయిలను వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన పనికి రాని పాత వాహనాలను అమ్మివేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
నిరాడంబరంగా పంద్రాగస్టు
కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈ సారి పంద్రాగస్టును అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవం నిర్వహించినట్లుగానే స్వతంత్ర దినోత్సవం నిర్వహించాలని తీర్మానించింది.
- August 5, 2020
- Top News
- CM KCR
- ONLINE CLASSES
- TELANAGANA
- TS B PASS
- ఆన్లైన్క్లాసెస్
- తెలంగాణ
- మంత్రివర్గభేటీ
- సీఎం కేసీఆర్
- Comments Off on విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు