Breaking News

బెల్లమే బెటర్‌‌

బెల్లమే బెటర్‌‌

బెల్లం వినియోగం భారతీయుల జీవనశైలిలో….

బెల్లం వినియోగం భారతీయుల జీవనశైలిలో ఒక భాగం. నిత్యం వంటలు, చిరుతిళ్లు, ఆరోగ్యం, నైవేద్యాలు, పెళ్లిళ్లు, పేరంటాల్లో ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కమ్మటి సువాసన, కంటికి ఇంపైన బంగారు రంగు కలిగిన బెల్లంతో తయారుచేసిన కేకులు, మిఠాయిలు మనసుకు హాయినిస్తాయి. పంచదారతో పోలిస్తే ఎలాంటి రసాయనాలు లేకుండా తయారయ్యే బెల్లంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లాన్ని చెరకు గడల నుంచి తయారుచేస్తారు. కొన్ని ప్రాంతాల్లో తాటి చెట్లు, ఈత చెట్ల నుంచి కూడా రసాన్ని సేకరించి బెల్లం తయారు చేస్తుంటారు. ప్రపంచంలో అతిపెద్ద బెల్లం మార్కెట్‌ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లో ఉండగా, రెండో అతిపెద్ద మార్కెట్‌ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి ఉంది. పంచదారలో అధిక క్యాలరీలు అందించే తీపి మాత్రమే ఉంటుంది. తక్కువ క్యాలరీలు అందించే బెల్లంలో అనేక విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. అందువల్ల పంచదారతో పోలిస్తే బెల్లాన్ని వినియోగించడమే ప్రయోజనకరమని చెబుతుంటారు. 

* బెల్లం వినియోగం భారతీయుల సంప్రదాయంలో మిళితమైంది. దేవతలకు ప్రసాదాల తయారీలో తప్పనిసరిగా వాడుతుంటారు. 

* తెలుగువారి పండుగల్లో బెల్లంతో చేసిన పదార్థాలు ఉండి తీరాల్సిందే. సంక్రాంతి పండుగకు బెల్లంతో చేసే అరిసెలు ప్రామాణిక వంటకం. కొత్త పంట చేతికి రాగానే చేసే తొలి వంటకం పొంగలితోనే నివేదన చేస్తారు. 

*శ్రీరామ నవమి రోజున సీతారాముల కల్యాణంలో బెల్లం పానకం తయారుచేసి ప్రసాదంగా పంచిపెడతారు. శివరాత్రి ఉత్సవాల్లో బెల్లపుబూందీ ప్రసాదానికి అగ్రస్థానం.

*గణపతి నవరాత్రుల్లో పానకం, పాయసం, దేవీ నవరాత్రుల్లో పరమాన్నం బెల్లంతో చేసేవే. దీపావళి మిఠాయి కోసం కొబ్బరి తురుముతో లౌజులు, గోధుమ పిండి హల్వా తయారీలో కూడా దీనిని వినియోగిస్తారు. అన్ని శుభకార్యాల్లో బెల్లం జిలేబీలు ఉండాల్సిందే. తిరుమలలో వెంకన్న నిత్య కైంకర్యాల్లో ఉండే పొంగలి బెల్లంతో చేసేదే. లక్షలాదిమంది భక్తులు వరంగల్‌జిల్లా మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో అమ్మవార్లకు  సమర్పించే బంగారం బెల్లమే. 

 *మధుమేహం ఉన్నవారు పంచదారకు ప్రత్యామ్నాయంగా స్టెవియా(తీపి ఆకు), షుగర్‌–ప్రీ బిళ్లలను వాడుతుంటారు. మధుమేహం లేని వారికి ఉత్తమ ప్రత్యామ్నాయం బెల్లం. అధిక తీపి, పంచదారతో కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెరగడంతో చాలామంది మరోసారి  కాఫీ, టీ ­తాగాలనిపించినా వెనకడుగు వేస్తున్నారు. ఇళ్లు, హోటళ్లలో అన్నిచోట్లా పంచదార వినియోగమే ఎక్కువ. దీంతో ఎక్కువ సార్లు తీయగా కాఫీ, టీ తాగితే రక్తంలో గ్లూకోజ్‌స్థాయిలు గణనీయంగా పెరిగిపోతాయి. పంచదారకు బదులు చిన్న బెల్లం ముక్కలు వేసుకుంటే ఆ బెడద ఉండదు. టీలో అల్లం, బెల్లం రెండూ కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద వైద్యనిపుణులు చెబుతుంటారు. సాధారణ జలుబు, అలర్జీలు దరిచేరకుండా చూస్తుంది.

రక్తహీనతకు చెక్

బెల్లంలో ఐరన్‌సమృద్ధిగా ఉంటుంది. రక్తకణాలకు ఆక్సిజన్‌సరఫరా చేసే హీమోగ్లోబిన్‌లో ఐరన్‌పాత్ర కీలకం. రోజూ క్రమం తప్పకుండా బెల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎర్ర రక్తకాణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఊపిరితిత్తుల నుంచి దేహం మొత్తానికి ఎర్ర రక్తకణాల ద్వారా ఆక్సిజన్‌అందడానికి దోహదపడుతుంది. రక్తహీనత (ఎనీమియా)తో బాధపడేవారు బెల్లం వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. 

జీర్ణవ్యవస్థకు రక్షణ

జీర్ణవ్యవస్థపై బెల్లం సానుకూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడేవారికి బెల్లం సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఉదయం లేవగానే బెల్లం కలిపిన టీ తాగితే జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. బెల్లంలో ఉండే పలు ఖనిజాల వల్ల శీతాకాలంలో శరీరంలో వెచ్చదనం పెరిగేలా చేస్తుంది.

బోలేడు లాభాలు

బెల్లంలో అధిక పోషకాలు ఉంటాయి. దీంతో ఆరోగ్యపరంగా చూసినా పంచదార కన్నా బెల్లమే బెటర్‌‌. బెల్లంలో అనేక విటమిన్లు, ఫాస్పరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, పోటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతో శరీరానికి ఫ్రీ రాడికల్స్‌తో కలిగే ముప్పు నుంచి రక్షణ ఏర్పడుతుంది. త్వరగా వృద్ధాప్యం రావడానికి ఫ్రీ రాడికల్సే కారణం. దేహాన్ని శుద్ధిచేయడంలో కూడా ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. బెల్లం మేలైన డి–టాక్సిన్‌గా పనిచేస్తుంది. దీంట్లో జింక్‌, సెలీనియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని వివిధ అవయవాల ద్వారా టాక్సిన్లను వెలుపలకు పోయేలా చేస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. 

బరువు తగ్గిస్తుంది

నిత్యం తగిన పరిమాణంలో బెల్లం ఆహారం ద్వారా తీసుకుంటే బరువు తగ్గే ప్రయత్నాలు సులభతరమవుతాయి. పొట్ట ప్రాంతంలో అదనపు కిలోలను కరిగించడం తేలికవుతుంది. మెటబాలిజం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆహారం జీర్ణం కావడానికి సహాయ ఎంజైములను బెల్లం ప్రేరేపిస్తుంది. దీంతో తిన్న ఆహారం మెరుగ్గా, వేగంగా జీర్ణమవుతుంది. అందువల్ల కొందరు భోజనం చేసిన తర్వాత బెల్లంతో చేసిన పదార్థాన్ని తినడానికి ఆసక్తి చూపుతుంటారు.

కేకుల తయారీ

ప్రపంచ ప్రసిద్ధిచెందిన చెఫ్‌లు సైతం బెల్లంతో చేసే డిజర్ట్‌లకు ప్రాధాన్యమిస్తారు. లిక్విడ్‌గోల్డ్‌(ద్రవరూపంలోని బంగారం)అని ముద్దుగా పిలుచుకునే బెల్లం ఎలాంటి రసాయనాలు లేని శుద్ధమైన తీపి పదార్థమని వారు పేర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో సాస్‌లు, గ్లేజ్‌లు, జామ్‌లు, కేక్‌లు, స్వీట్లను బెల్లంతో చేస్తారు. తాటి బెల్లంతో చేసే గోధుమ కేక్‌, నోటిలో వేసుకోగానే కరిగిపోయే కారుపట్టి హల్వా, సీజనల్‌పండ్లతో చేసే పేల్‌ఆలే, గుడ్‌కి ఖీర్‌వంటివి చెఫ్‌లు ఎంపిక చేసిన జాబితాలో కొన్ని ఐటెమ్‌ల పేర్లు. బెల్లాన్ని సన్నగా తురిమి నీటిలో కరిగించి సిరప్‌గా తయారు చేస్తారు. ఆ సిరప్‌ను కస్టర్డ్‌లు, రైస్‌, ఐస్‌క్రీమ్‌లపై పోసి అందిస్తారు. బంగారు రంగులో మెరిసిపోయే ఆ సిరప్‌రుచిలోనూ అమోఘం. 

మహిళలకు మేలు

రోజూ ఆహారంలో బెల్లం ఉండేలా చూసుకుంటే మహిళలకు ఎంతో మేలు కలుగుతుంది. రోజువారి ఆహారంలో బెల్లాన్ని క్రమంతప్పకుండా తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే సమస్యలను అధిగమించడానికి తోడ్పడుతుంది.  రుతుక్రమంలో వచ్చే చికాకులు, కడుపునొప్పి బెల్లంతో దూరమవుతాయి. ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.

ఆయుర్వేద వైద్యం

పురాతన కాలం నుంచి ఆయుర్వేద ఔషధాల తయారీలో బెల్లాన్ని వినియోగిస్తారు. అయితే మధుమేహం ఉన్నవారికి దీనిని సిఫార్సు చేయరు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, గొంతునొప్పి, పార్శపు నొప్పి (మైగ్రేన్‌), ఆస్తమా వంటి వ్యాధుల నివారణకు వివిధ మూలికల్లో బెల్లం ఉపయోగించి చేసిన ఔషధాలను రూపొందిస్తారు. 

మధుమేహం ఉన్నవాళ్లు తినొద్దు

మధుమేహం సమస్య ఉన్నవారికి పంచదార మాదిరిగానే బెల్లం ప్రభావం కూడా ఉంటుంది. అయితే దేహంలో బెల్లం పూర్తిగా శోషితం (ఇంకడానికి) పంచదార కన్నా ఎక్కువ సమయం పడుతుంది. ఒక టీస్పూన్‌పంచదార ద్వారా 60 క్యాలరీలు లభిస్తే అదే పరిమాణం ఉన్న బెల్లం ద్వారా 27 క్యాలరీలు వస్తాయి. బెల్లంలో 70 శాతం సూక్రోజు, 10 శాతం గ్లూకోజు, ఫ్రక్టోజు ఉంటాయి. పంచదారలో 50 శాతం ఫ్రక్టోజు ఉంటుంది. అందువల్ల న్యూట్రిషనిస్టులు పంచదార వాడకం సరైందని కాదని చెబుతుంటారు. అధిక పంచదార వినియోగంతో గుండె జబ్బులు, ఊబకాయం వస్తాయని అమెరికన్‌హార్ట్‌అసోసియేషన్‌కూడా హెచ్చరిస్తోంది. పంచదార ద్వారా కేవలం క్యాలరీలు మాత్రమే శరీరానికి అందుతాయి. అయితే బెల్లం తయారీలో రసాయనాల వినియోగం లేకపోవడంతో విటమిన్లు, ఖనిజాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. పంచదారతో పోల్చితే బెల్లం నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. అయినా, మధుమేహంతో బాధపడేవారు బెల్లంతో చేసిన పదార్థాలను పరిమితంగానే తినాలి.

పంచదార కన్నా బెల్లమే మేలు

గ్లైసిమిక్‌ఇండెక్స్‌(జీఐ) ప్రకారం పంచదార కన్నా బెల్లమే మేలు. జీఐ సంఖ్య ఒక  ఆ ఆహారం ఎంత త్వరగా జీర్ణమై దేహంలో గ్లూకోజ్‌గా మారుతుందో సూచిస్తుంది. అంటే ఆ ఆహారం ఎంత వేగంగా రక్తంలో గూకోజ్‌ను పెంచుతుందో తెలియజేస్తుంది. ఏదైనా ఆహార సూచీ(జీఐ) తక్కువగా ఉంటే ఆ ఆహారం జీర్ణం కావడానికి అధిక సమయం పడుతుంది.  ఫలితంగా రక్తంలో షుగర్‌నెమ్మదిగా పెరుగుతుంది. అధిక జీఐ సంఖ్య ఉన్న అధిక జీఐ ఉన్న ఆహారం త్వరగా జీర్ణమై, రక్తంలో షుగర్‌స్థాయులు వేగంగా పెంచుతాయి. సాధారణంగా జీఐ 55 కన్నా తక్కువగా ఉంటే అది మంచిది, ఆరోగ్యకరమైన ఆహారం అని చెబుతారు. జీఐ 70 కన్నా ఎక్కువగా ఉన్న ఆహారం అనారోగ్యకరమైందని పరిగణిస్తారు. ఎందుకంటే అధిక జీఐ ఉండే ఆహారం రక్తంలో గ్లూకోజ్‌స్థాయుల్ని వేగంగా పెంచి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఊబకాయానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. బెల్లం గ్లైసిమిక్‌సూచీ 80 కాగా పంచదార సూచీ 105 మేర ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అందువల్ల పిల్లలు ఇష్టపడే కేకులు, మిఠాయిలు, చాక్లెట్ల విషయంలో  పంచదారతో చేసిన వాటి కన్నా బెల్లంతో చేసిన వాటికి ప్రాధానం ఇవ్వడం మేలు. బెల్లపు పాకంతో చేసే మర్మరాల ఉండలు, వేరుశనగ పప్పు ఉండలు, జీడిపప్పు ఉండలతో అటు రుచికి రుచి, ఇటు దేహానికి బలం ఇస్తుంది.