కరాచీ: ప్రేక్షకులు లేకుండా క్లోజ్డ్ డోర్స్‌లో టీ20 వరల్డ్‌కప్‌ను నిర్వహించడాన్ని ఊహించుకోలేకపోతున్నానని పాకిస్థాన్ పేస్ లెజెండ్ వసీమ్ అక్రమ్ అన్నాడు. మెగా ఈవెంట్ నిర్వహణకు ఐసీసీ సరైన టైమ్ కోసం వేచి చూడాలన్నాడు. ‘ప్రేక్షకులు లేకుండా వరల్డ్‌కప్‌ను నిర్వహించడమా? అసలు ఈ ఐడియానే కరెక్ట్ కాదు. వరల్డ్‌కప్‌ను చూడడానికి ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల నుంచి అభిమానులు వస్తారు. వాళ్ల కంట్రీ టీమ్స్‌కు సపోర్ట్ ఇస్తారు. ఇదంతా ఓ రకమైన వాతావరణం. ఇది లేకుండా క్లోజ్డ్ డోర్స్‌లో మ్యాచ్‌లు ఆడడం ఊహించుకోలేకపోతున్నా. ఐసీసీ మరికొంత కాలం వేచిచూడాలి. సరైన టైమ్‌లోనే మెగా ఈవెంట్‌ను హోస్ట్ చేయాలి. కరోనా మహమ్మారి కంట్రోల్ అయిన తర్వాత, ట్రావెల్ రిస్ట్రిక్షన్స్‌ను ఎత్తేశాక టోర్నీ విషయంలో ముందుకెళ్లాలి’ అని అక్రమ్ పేర్కొన్నాడు. బాల్ షైనింగ్‌కు ఉపయోగించే సలైవాను బ్యాన్ చేయడంపై కూడా అక్రమ్ స్పందించాడు. కేవలం చెమటతోనే బాల్‌ను షైన్ చేయలేమన్నాడు. ఈ విషయంలో వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలన్నాడు.
‘సలైవాను బ్యాన్ చేయడాన్ని పేస్ బౌలర్లు ఎక్కువ కాలం ఇష్టపడరు. చెమటతో షైన్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. సలైవాతో షైన్ చేసిన తర్వాత మరింత మెరుగు కోసం చెమటను ఉపయోగిస్తారు. చెమటను ఉపయోగించడం టాప్ అప్ లాంటింది. చెమట ఎక్కువైనా బాల్ తడిగా మారిపోతుంది. అప్పుడు కొత్త ఇబ్బందులు వస్తాయి’ అని అక్రమ్ వ్యాఖ్యానించాడు.