Breaking News

నాగర్ కర్నూల్​ జిల్లాలో మరో పాజిటివ్ కేసు

  • వెల్లడించిన కలెక్టర్ శ్రీధర్

సారథి న్యూస్, నాగర్ కర్నూల్​: నాగర్ కర్నూల్​ జిల్లా చారకొండ మండలం రామచంద్రాపురంలో ఈ నెల 23న కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా బుధవారం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ శ్రీధర్ అప్రమత్తం చేశారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో కరోనా నివారణ చర్యలపై కల్వకుర్తి ఆర్డీవో ఆఫీసులో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, గ్రామాల్లో మాస్క్​లు కట్టుకోవాలని, భౌతిక దూరం తప్పనిసరి అని ఆదేశించారు.

రామచంద్రాపురంలో ప్రైమరీ కాంటాక్ట్స్ 44 మంది, సెకండరీ ప్రైమరీ కాంటాక్ట్స్ 80 మందిని హోమ్ క్వారంటైన్ లో ఉంచామని, కొండారెడ్డిపల్లి ప్రైమరీ కాంటాక్ట్స్ 14 మందిని గుర్తించామని తెలిపారు. అధికారులు ఆయా గ్రామాల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలని, శానిటేషన్ పనులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ రెండు కేసులు హైదరాబాద్​కు చికిత్స నిమిత్తం వెళ్లిన వారేనని తెలిపారు. అయితే రామచంద్రాపురం ముగ్గురు ప్రైమరీ కాంటాక్ట్స్ కరోనా పరీక్షలు నిర్వహించగా, వారికి కరోనా లేదని నిర్ధారణ అయిందన్నారు.

పాజిటివ్ కేసులకు సంబంధించిన వారిని హోమ్ క్వారంటైన్ కు తరలించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాల్లో కిరాణం, మెడికల్, బ్యాంకులు ఇతర ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్​లు ధరించి భౌతిక దూరం పాటించాలని, అలా పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని జరిమానా విధించాలని హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్ వో సుధాకర్ లాల్, ఆర్డీవో రాజేష్ కుమార్, కల్వకుర్తి డీఎల్పీవో, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.