Breaking News

ధోనీని గుర్తుకు తెస్తాడు

వెటరన్ ప్లేయర్ సురేశ్ రైనా

ముంబై: ఐపీఎల్లో చెన్నై సూపర్​ కింగ్స్​కు పోటీ ఇవ్వగల జట్టు ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్స్. కెప్టెన్ రోహిత్​ రాకతో మరింత బలంగా తయారైన ముంబై.. నాలుగుసార్లు టైటిల్స్​ను కూడా కొల్లగొట్టింది. అయితే కెప్టెన్సీ విషయంలో కొన్నిసార్లు రోహిత్.. ధోనీని గుర్తుకు తెస్తాడని వెటరన్ ప్లేయర్ సురేశ్ రైనా అన్నాడు. కొన్ని లక్షణాలు అచ్చం మహీని పోలి ఉంటాయన్నాడు. ‘ప్రశాంతత, ఆటగాళ్లకు ప్రేరణ కల్పించడంలో ధోనీలాగా వ్యవహరిస్తాడు. కెప్టెన్సీ కూడా మహీలాగే చేస్తాడు. మైదానంలో కూల్​గా ఉంటూనే తనకు కావాల్సిన ఫలితాన్ని రాబట్టుకుంటాడు. ఈ లక్షణం ధోనీ నుంచే నేర్చుకున్నాడు. మైదానంలోకి ఎప్పుడు వెళ్లినా కచ్చితంగా పరుగులు రాబడతాడనే ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాడు.

ఆ ఆత్మవిశాస్వంతోనే ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తాడు. రోహిత్​లో ఉండే ఈ లక్షణాలంటే నాకూ చాలా ఇష్టం’ అని రైనా పేర్కొన్నాడు. ఓ సారి పుణేతో జరిగిన మ్యాచ్​లో రోహిత్ తీసుకున్న రెండు, మూడు నిర్ణయాలు మ్యాచ్ ఫలితాన్ని శాసించాయన్నాడు. మందకొడి వికెట్​పై పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటాడన్నాడు. దీనివల్ల తన జట్టుపై ఒత్తిడి తగ్గించడంతో పాటు ప్రత్యర్థులను ఒత్తిడికి లోను చేస్తాడని చెప్పాడు. బయటి నుంచి సలహాలు వచ్చినా.. సమయానికి అ​నుకూలంగా తానే నిర్ణయాలు తీసుకుంటాడని రైనా వెల్లడించాడు. అందుకే ఐపీఎల్​ రోహిత్ అత్యధిక టైటిల్స్ గెలవడంలో ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదన్నాడు.