న్యూఢిల్లీ: మాజీ సారథి ధోనీ వల్లే తాను అంతర్జాతీయ క్రికెట్లో ఎదిగానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. దాదాపు ఆరు, ఏడు ఏళ్ల పాటు మహీ తనపై దృష్టిపెట్టడంతోనే ఇదంతా సాధ్యమైందన్నాడు. రాత్రికిరాత్రే తాను కెప్టెన్ కాలేదని స్పష్టం చేశాడు. ‘ఓ క్రికెటర్‌గా నాకంటూ ఓ ఆటతీరు ఉంటుంది. కానీ కెప్టెన్‌గా ఎలా? అందుకే ధోనీ నన్ను చాలా కాలం పాటు దగ్గరి నుంచి గమనించాడు. మ్యాచ్‌లో నా బాధ్యతల నిర్వహణ, ఆటతీరును, సహచరులతో ప్రవర్తన.. ఇలా అన్ని అంశాలను పరిశీలించాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ లేడు కాబట్టి నీవు కెప్టెన్సీ చేయమని నాకెవ్వరూ చెప్పలేదు. నా తర్వాత కెప్టెన్‌గా ఈ వ్యక్తి పనికొస్తాడని మహీ గుర్తించడం వల్లే ఇది సాధ్యమైంది. ఆ తర్వాత నెమ్మదిగా మార్పు మొదలైంది.
ఈ మార్పు కూడా ఒక్క రోజులో జరగలేదు. భవిష్యత్ ను దృష్టిలోఉంచుకుని ధోనీ ఎప్పుడూ నన్ను అతనికి దగ్గరలోనే ఫీల్డింగ్‌లో ఉంచుకునేవాడు. ఏదైనా ఓ సందర్భంలో ‘ఇప్పుడు ఏం చేద్దాం, బౌలింగ్‌లో మార్పులు ఏమిటి.. ఇలా కొన్ని విషయాలను చర్చించేవాడు. ఆ చర్చల్లో చాలాసార్లు నా నిర్ణయాలతో విభేదించినా.. వాటివల్లే నేను కెప్టెన్సీకి పనికొస్తాననే నమ్మకాన్ని ఏర్పర్చుకున్నాడు. ఆ నమ్మకమే చివరకు నన్ను కెప్టెన్ చేసింది. నేను కెప్టెన్సీ తీసుకున్న తొలినాళ్లలోనూ నాకు అండగా నిలిచేవాడు. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.. వాటిని సరి చేస్తూ నా కెరీర్ ఎదుగుదలకు దోహదపడ్డాడు. అందుకే ధోనీ నాకు సహచరుడి కంటే ఎక్కువ’ అని స్పిన్నర్ అశ్విన్‌తో జరిగిన ఇన్స్టాగ్రామ్ చర్చలో కోహ్లీ వ్యాఖ్యానించాడు. తనకు గ్రహంతరవాసుల గురించి తెలుసుకోవడం ఆసక్తి అని చెప్పిన విరాట్.. ఎగిరే పళ్లాలు (యూఎఫ్ వో)లను చూడాలన్నది తన లక్ష్యమన్నాడు.