Breaking News

మనోజ్ కుటుంబాన్నిఆదుకోండి

సారథి న్యూస్, ఎల్బీనగర్ (రంగారెడ్డి) : విధి నిర్వహణలో కరోనాతో మృతిచెందిన జర్నలిస్టు మనోజ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించి, అతని ఇంటిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడు, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి బోసుపల్లి ప్రతాప్ డిమాండ్ చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బచ్చి గళ్ల రమేష్ ఆధ్వర్యంలో ఈనెల 7న విధి నిర్వహణలో మృతిచెందిన టీవీ రిపోర్టర్ మనోజ్ కుమార్ మృతికి సంతాపంగా తుర్కయంజాల్ చౌరస్తాలో బుధవారం అతని చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించి.. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ముఖ్యఅతిథిగా బోసుపల్లి ప్రతాప్ హాజరై మాట్లాడుతూ.. టీవీ యాజమాన్యం కూడా మనోజ్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యం ఎంతోమంది పాత్రికేయులు విధి నిర్వహణలో చాలా కష్టపడుతున్నారని, ప్రభుత్వం వారికి కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర అమోఘమైందని, ప్రభుత్వమే వారికి అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగానే జర్నలిస్టులకు కూడా అన్ని బెనిఫిట్స్​ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక రిపోర్టర్లు, బీజేపీ జిల్లా నాయకులు శ్రావణ్ కుమార్, ధరావత్ శ్రీనివాస్ నాయక్, మైలారం బాబు, మధు, శ్రీకాంత్ రెడ్డి, నల్లవెల్లి నిరంజన్ రెడ్డి, సామిరెడ్డి పాల్గొన్నారు.