Breaking News

చాపెల్​ది స్వయంకృతాపరాధం

  • టీమిండియా మాజీ స్టార్​ బ్యాట్స్​మెన్​ కైఫ్​

న్యూఢిల్లీ: సరిగ్గా పనిచేసి ఉంటే ఆసీస్ మాజీ బ్యాట్స్​మెన్​ గ్రెగ్ చాపెల్.. టీమిండియాకు అత్యుత్తమ బ్యాటింగ్ కోచ్ అయి ఉండేవాడని మహ్మద్ కైఫ్ అన్నాడు. తన స్వయంకృతాపరాధం వల్లే పదేపదే తప్పులు చేస్తూ పేరును చెడగొట్టుకున్నాడన్నాడు. భారత్​కు జాన్ రైట్ ఇచ్చిన వారసత్వాన్ని నిలబెట్టలేకపోయాడని విమర్శించాడు. ‘చాపెల్ రాగానే జట్టులో బేధాభిప్రాయాలు వచ్చేలా నిర్ణయాలు తీసుకున్నాడు. గంగూలీని కెప్టెన్సీ నుంచి తీసేయడం, క్రమంగా టీమ్​కు దూరం చేయడంతో ఆందోళనలు మొదలయ్యాయి.

టీమ్​ను సమష్టిగా ఉంచడంలో విఫలమయ్యాడు. మన సంస్కృతిని, సంప్రదాయాలను అర్థం చేసుకోలేకపోయాడు. మ్యాన్ మేనేజ్​మెంట్​ స్కిల్స్ కూడా చాపెల్​లో లేవు. అందుకే ప్రతి ఒక్కరి బలహీనతలను ముందుకు తీసుకొచ్చి ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా ప్రవర్తించాడు. ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చే ఒక్క అంశం చాపెల్ కోచింగ్​లో లేవు.

అందుకే కోచ్​గా తనకు తానుగా అతను విఫలమయ్యాడు’ అని కైఫ్ పేర్కొన్నాడు. టీమిండియాను సమర్థవంతంగా గాడిలో పెట్టిన ఘనత జాన్ రైట్​కే చెందుతుందన్నాడు. ప్లేయర్లు, కెప్టెన్​కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు అందరి మధ్య మంచి సమన్వయం ఉండేలా చూసేవాడన్నాడు. ఈ నిర్ణయాల వల్లే భారత్ బాగా విజయవంతమైందని కైఫ్ చెప్పుకొచ్చాడు.