Breaking News

ఆస్పత్రిని ఓపెన్​ చేయండి.. సార్లూ!

ఆస్పత్రిని ఓపెన్​ చేయండి.. సార్లూ!

  • బాలారిష్టాల్లో రామవరం పీహెచ్ సీ
  • ఆస్పత్రి భవనం కట్టించారు.. వదిలేశారు
  • మందుబాబులకు అడ్డాగా మారిన వైనం

సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రజలందరికీ వైద్యం అందించాలనే సంకల్పంతో ఆస్పత్రులను నిర్మించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలను నెలకొల్పేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం శివారులో 2014 మార్చి 1న వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ(ఎన్ఆర్ హెచ్ఎం) నిధులతో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నిర్మాణానికి అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి భూమి పూజచేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో అనతికాలంలోనే ఆస్పత్రి పనులను పూర్తిచేశారు. అయితే ఇప్పటిదాకా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు.

ఆరున్నరేళ్లు గడిచినా..
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గెలుపొంది ఆరున్నరేళ్లు అయినా ప్రాథమిక వైద్యారోగ్యకేంద్రం ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. సిద్దిపేట జిల్లాలోనే అక్కన్నపేట మండలం గిరిజన తండాలను కలుపుకుని 32 పంచాయతీలతో అతిపెద్ద మండలంగా 2016లో ఏర్పడింది. చుట్టుపక్కల గిరిజన తండాల్లోని ప్రజలకు రాత్రుళ్లు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స కోసం హుస్నాబాద్​ 16 కి.మీ. నుంచి కరీంనగర్, వరంగల్, జనగాం, సిద్దిపేట జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 50 కి.మీ ప్రయాణం చేయక తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో వైద్యం అందక మృతిచెందినవారు ఉన్నారు.

రాజకీయ ఉద్దండులు ప్రాతినిథ్యం వహించినా..
ప్రైవేట్​కు దీటుగా సర్కార్ వైద్యం అందిస్తామన్న పాలకుల వాగ్దానాలు మాటలకే పరిమితమైంది. మారుమూల తండాల్లోని గిరిజనులు, నిరుపేదలకు సర్కార్ వైద్యం అందకపోవడంతో సాధారణ జ్వరానికి సైతం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఆస్పత్రి భవనాన్ని లక్షల రూపాయలతో నిర్మించి ప్రారంభించకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. సీఎం కేసీఆర్​ సొంత జిల్లా, మంత్రి హరీశ్​రావు వంటి రాజకీయ ఉద్దండులు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో ఆస్పత్రి ఇలా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైన కలెక్టర్, మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని ఆస్పత్రికి వైద్యసిబ్బందిని నియమించడంతో పాటు వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ప్రజల్లో నమ్మకం పోయింది

ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తయి ఏండ్లు గడుస్తున్నా ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేదొకటి చేసేది మరొకటి. సర్కార్ వైద్యంపై ప్రజల్లో పూర్తిగా నమ్మకం పోయింది. ఆస్పత్రికి కేటాయించిన పరికరాలు, ఫర్నిచర్ పూర్తిగా పాడైపోతున్నాయి.
:: ఎడేల వనేష్, సీపీఐ మండల కార్యదర్శి

ప్రజాప్రతినిధులు ప్రేక్షకపాత్ర

ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నేతలు ప్రేక్షక పాత్రను వహిస్తున్నారు. పట్నం నుంచి పల్లె వరకు కరోనా పాకుతోంది. ఓ వైపు సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటే.. పాలకులు, వైద్యారోగ్య అధికార యంత్రాంగం ప్రజలకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమైంది.
:: జంగపల్లి అయిలయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు

పేదలకు మెరుగైన వైద్యం అందించాలి

పేద, మధ్యతరగతి ప్రజలకు సర్కార్ వైద్యం అందని ద్రాక్షగానే అయిపోయింది. దూర ప్రాంతాలకు పోయి, ప్రైవేట్ ఆస్పపత్రులకు డబ్బులు పెట్టలేక అప్పులవుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా పాలకులు మొద్దునిద్ర వీడడం లేదు. వెంటేనే ఆస్పత్రికి వైద్యులను నియమించి పేదలకు మెరుగైన వైద్యం అందించాలి.
:: గొల్లపల్లి వీరాచారి, బీజేపీ మండలాధ్యక్షుడు