సారథి న్యూస్, మహబూబ్ నగర్: దక్షిణ తెలంగాణ ప్రజల గోస తీరాలంటే కృష్ణానదిపై ప్రతిపాదిత పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తిచేయాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమం తప్పదన్నారు. కృష్ణాజలాలను అక్రమంగా రాయలసీమకు తరలించుకుపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే పరిస్థితి లేదన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ మీటింగ్ హాల్లో జర్నలిస్టులకు బియ్యం, ఇతర నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..
విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులకు అండగా నిలబడ్డామన్నారు. ఇప్పటికే చాలాచోట్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులను తోచిన సాయం చేస్తున్నామని ప్రకటించారు. నిత్యం సమాజం కోసం పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వయసు పైబడిన జర్నలిస్టులను యాజమాన్యాలు వదిలించుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్ల సర్వీస్ కలిగిన ప్రతి జర్నలిస్టుకు రూ.10వేల పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో టీజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ కాటం జగదీశ్గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ వెంకటగిరి, జిల్లా నాయకులు శ్రీనివాస్, నవీన్, రామస్వామి పాల్గొన్నారు.