న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి అక్టోబర్‌లో టీకా వచ్చే అవకాశం ఉన్నదని బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇటీవల చింపాంజీలపై చేసిన ప్రయోగాలు చాలా వరకు విజయవంతమయ్యాయని చెప్పారు. మానవ ప్రయోగాలను వేగంగా నిర్వహిస్తున్నట్టు ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త జెనెన్‌ర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆడ్రియన్ హిల్ ప్రకటించారు. ఫార్మా కంపెనీ ఆస్ట్రా జెనెకాతో కలిసి ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ కొత్త టీకాను ఇప్పటికే బ్రెజిల్‌లోని కొంతమంది కార్యకర్తలపై ప్రయోగించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ టీకా మేలైన ఫలితాలు ఇస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ కారణంగానే ఈ టీకా ఇప్పటికే మానవ ప్రయోగాల తుదిదశ కు చేరుకుందని అంచనా. దక్షిణాఫ్రికాలోనూ ఈ టీకాను సుమారు 200 మందిపై ప్రయోగిస్తున్నారు. బ్రిటన్‌లో సుమారు 4000 మంది ఇప్పటికే టీకా ప్రయోగాలకు తమ సమ్మతిని తెలిపారని, మరో పదివేల మందిని సమీప భవిష్యత్తులో నియమించుకుంటామని కంపెనీ చెబుతోంది. ఏప్రిల్ 23న ఈ మానవ ప్రయోగాలు మొదలయ్యాయని సమాచారం.