Breaking News

యథేచ్చగా రేషన్ బియ్యం దందా

… ఎలక్షన్ బిజీలో ఆఫీసర్లు
…. బియ్యం దందాలో రైస్ మిల్లర్లు
…. అధికారుల కనుసన్నల్లోనే అక్రమ దందా
…. రైస్ మిల్లర్ల కు అండగా అధికార పార్టీ లీడర్లు
… పట్టించుకోని జిల్లా ఉన్నతాధికారులు

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో:నాగర్ కర్నూల్ జిల్లాలో అక్రమ రేషన్ దందా యథేచ్చగా కొనసాగుతోంది. ఎన్నికల విధుల్లో జిల్లా ఉన్నతాధికారులు బిజీబిజీగా ఉండడంతో రైస్ మిల్లర్లు ఇదే అదునుగా రెచ్చిపోతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మహదేవుని పేట నుంచి గంగారం వెళ్లే దారిలో ఉన్న ఓ రైస్ మిల్ కు ఇప్పటికీ పేరు లేకుండా నే రేషన్ దందాకు అడ్డాగా మారింది. శ్రీ లక్ష్మి నరసింహ్మ రైస్ మిల్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి కనీసం బోర్డు కూడా పెట్టకుండానే సదరు మిల్లు యజమాని శివయ్య దర్జాగా రేషన్ దందాను కొనసాగిస్తున్నా పట్టింఛుకునే నాథుడే కరువయ్యారు. రైస్ మిల్ యజమాని శివయ్య వనపర్తి జిల్లా కు చెందిన వాడు కావడంతో అటు వనపర్తి ఇటు నాగర్ కర్నూల్ జిల్లాల్లోని రేషన్ బియ్యాన్ని దర్జాగా తన మిల్లుకు తరలించి రిసైక్లింగ్ చేస్తూ తిరిగి ప్రభుత్వానికి అంటగడుతున్నా జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. గత నాలుగు నెలల నుండి సాధారణ సమయంలోనే రేషన్ దందా ను కొనసాగిస్తున్న ఈ మిల్లు యజమానికి ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో అక్రమ రేషన్ దందా ను మరింత జోరుగా కొనసాగించడం విశేషం.

అధికారుల కనుసన్నల్లోనే…
నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) , రేషన్ బియ్యం దందా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుండడం విచారకరం. నిరుపేదలకు అందాల్సీన రేషన్ బియ్యం సివిల్ సప్లై అధికారుల అండదండలతో నేరుగా రైస్ మిల్లులకు చేరడం అదే బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికే అండగడుతూ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు. ఈ అక్రమ దందా లో రెండు జిల్లాల అధికారుల పాత్రతో అధికార పార్టీ లీడర్ల అండదండలు ఉండడంతో రైస్ మిల్లర్లు మరింత రెచ్చిపోతున్నారు. ఎక్కడికక్కడ అధికారులను, సిబ్బందిని రైస్ మిల్లర్లు ప్రతి నెల మామూళ్లు ఇస్తూ వారికి అనుకూలంగా మార్చుకోవడంతో రేషన్ అక్రమ దందా ఎలాంటి అడ్డంకులు లేకుండా దర్జాగా కొనసాగిస్తున్నారు.
సీఎం ఆర్ వడ్లకు లెక్కలేవి..?
నిరుపేదలకు ప్రభుత్వం సరఫరా చేయాల్సిన రేషన్ బియ్యం కోసం రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేసి సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) పద్దతిలో రైస్ మిల్లర్లకు అధికారులు కెటాయిస్తున్నారు. కాని నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎంఆర్ వడ్లకు లెక్కల్లేకుండా పోయాయి. సివిల్ సప్లై అధికారులు రైస్ మిల్లర్లు కుమ్మక్కై రూల్స్ ను పట్టించుకోకుండా అడ్డగోలుగా రైస్ మిల్లులకు వరి ధాన్యాన్ని కెటాయిస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ప్రభుత్వం నుంచి రైస్ మిల్లర్లకు సరఫరా చేసిన వడ్లను దర్జాగా రైస్ మిల్లర్లు ఇతర రాష్ట్రాలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వాని కి ఇవ్వాల్సీన రేషన్ బియ్యాన్ని కొంతమేర రేషన్ డీలర్ల వద్ద, మరికొంత ప్రజల వద్ద కొనుగోలు చేస్తున్నారు. ఇంకొందరు నేరుగా వనపర్తి సివిల్ సప్లై గోదాం నుంచే రేషన్ బియ్యాన్ని తరలించి రీ సైక్లింగ్ చేసి అవే బియ్యాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఈ దందా లో సివిల్ సప్లై అధికారులు, పోలీసులకు ప్రతి నెల మామూళ్లు భారీగా ఉంటుండడంతో అక్రమ రేషన్ దందాకు అడ్డకట్ట పడడంలేదు.

చిరువ్యాపారుల పైనే ప్రతాపం…
నాగర్ కర్నూల్ జిల్లాలో అధికారులు, అధికార పార్టీ లీడర్ల అండదండలతో బియ్యం మాఫీయా కోట్లు గడిస్తున్నా సివిల్ సప్లై శాఖ అధికారులు, పోలీసులు మాత్రం చిరువ్యాపారులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. బిజినపల్లి మండలం మహదేవుని పేట గంగారం రోడ్ లో బోర్డు కూడా పెట్టకుండా అటు సీఎం ఆర్ వడ్ల దందా, ఇటు రేషన్ దందా కొనసాగిస్తున్న రైస్ మిల్ యజమాని అక్రమ దందా అధికారులకు మాత్రం కనపడడం లేదు. పైగా సదరు యజమాని తనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ల తో ఫొటో లు దిగి మాకు అండదండలు ఉన్నాయంటూ చెప్పుకుంటూ పట్టపగలే అక్రమ రేషన్ దందా ను కొనసాగిస్తున్నా అధికారులకు పట్టడం లేదు. గ్రామాలలో ఎక్కడైన తక్కువ మోతాదులో రేషన్ బియ్యం కొనుగోలు చేసే చిరువ్యాపారులపై అటు పోలీసులు ఇటు సివిల్ సప్లై అధికారులు తమ ప్రతాపం చూపుతూ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. కాని ఇలాంటి బడా వ్యాపారులకు అధికారులు, పోలీసులు కొమ్ముకాస్తూ తమ వంతు పర్సెంటేజీలు తీసుకొని వదిలేస్తున్నట్లు సమాచారం.

మా దృష్టికి రాలేదు:
రాము మోహన్ , ఎన్ఫ్ ర్ మెంటు అధికారి , నాగర్ కర్నూల్ జిల్లా లో రేషన్ అక్రమదందా విషయం మా దృష్టికి రాలేదు. మహదేవుని పేట, గంగారం రోడ్ లో శ్రీ లక్ష్మి నరసింహ్మ రైస్ మిల్ ఉన్నట్లు రికార్డులో ఉంది. రైస్ మిల్ కు బోర్డు రాయించాలని చాలా సార్లు చెప్పాం. మరో సారి పరిశీలించి విచారణ చేస్తాం. ఏదైనా అక్రమంగా రేషన్ బియ్యం దందా చేస్తున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.