- కల్లాలబాట పట్టిన దళారులు
సామాజిక సారథి, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులు పేరుకుపోతున్నాయి. అయితే ప్రభుత్వ కేంద్రాలు ప్రారంభించిన ఇంకా ఎక్కడా కొనుగోలు ప్రారంభించకపోవడంతో ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న దళారులు దందాకు తెరలేపారు. నేరుగా కాంటాలతో కల్లాలబాట పట్టిన దళారులు. రైతుల పొలాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. తేమ అధికంగా ఉన్నా కాంటాలు వేసుకుంటు పచ్చి ధాన్యాన్నే దోచుకుంటున్నారు. తూకాలకు డిజిటల్ వేయింగ్ మిషన్లను వినియోగిస్తున్న దాఖలాలు లేవు. తాళ్లతో తయారు చేసిన వాటితో బస్తాను పడికట్టి కాంటా రాళ్లు లేకుండా తూకాలు వేస్తూ రైతులను నిలువునా మోసం చేస్తున్నా, తూనికల కోలతల అధికారులు కూడా ఇటువైపు తోంగి చూడకపోవడం గమనార్హం. ఇప్పటికైన అధికారులు కొనుగోలు కేంద్రాలలో ప్రారంభించకుంటే మండలంలోని ధాన్యమంతా దళారుల పాలు కావాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్కువకు కొనుగోలు
నిబంధనల ప్రకారం గ్రేడ్ ఏ రకం ధాన్యం ధర క్వింటాకు రూ 1960, సాధారణ రకం ధర రూ 1940 గా ఉంది. అయితే ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి క్వింటాకు రూ 900 నుంచి రూ 1200 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇలా క్వింటా వద్ద దాదాపు రూ 700 వరకు ధర తగ్గించి చెల్లిస్తున్నారు. టన్నుల కొద్దీ ధాన్యాన్ని కొనుగోలు చేసిన వ్యాపారులు తిరిగి ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాల వారీగా ధాన్యం కొనుగోలు చేసే దళారులపై అధికారులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.