Breaking News

కులాంతర చేసుకున్నడని గుళ్లోకి రానియ్యలే..!

కులాంతర చేసుకున్నడని గుళ్లోకి రానియ్యలే..!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఓవైపు శాస్త్ర సాంకేతికరంగాల్లో దేశం ముందుకెళ్తున్నా ఇంకా కొందరి మూఢవిశ్వాసాలు, నమ్మకాలతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ కులం అమ్మాయిని కాకుండా మరో కులానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నందుకు గుడిలోకి అనుమతి లేదని కొందరు కులపెద్దలు అటవిక న్యాయం చెప్పేశారు. గుడిలోకి అనుమతి కావాలంటే ముందు మీ భార్యకు విడాకులు ఇచ్చిరావాలని కండీషన్​ పెట్టారు. ఈ ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుల కథనం మేరకు.. ఇంద్రకల్ గ్రామానికి చెందిన భరత్ కురువ కులానికి చెందినవాడు. రెండేళ్ల క్రితం హైదరాబాద్ కు చెందిన వడ్డెర కులానికి చెందిన ఓ యువతిని ఇష్టపడి మరీ తల్లిదండ్రులను ఒప్పించి కులాంతర వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ దంపతులకు ఓ పాప కూడా పుట్టింది. అయితే తన స్వగ్రామం ఇంద్రకల్ లో ఈనెల 20వ తేదీ(శనివారం) నుంచి మూడు రోజుల పాటు తమ కులదైవమైన బీరప్ప ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కులపెద్దలు నిర్ణయించారు. దీంతో తన భార్యాపిల్లలతో రెండురోజుల క్రితం భరత్ ఇంద్రకల్ కు వచ్చాడు.

గుడిలోకి రానివ్వం
కులాంత వివాహం చేసుకున్న భరత్​ కు బీరప్ప గుడిలోకి అనుమతి లేదని ఆయన కులస్తులు కొందరు నిర్ణయం తీసుకున్నారు. వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుని గుడిలోకి వస్తే దేవుడి మైల అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ గుడిలోకి మీరు రావద్దని కులపెద్దలు హెచ్చరించారు. ఒకవేళ గుడిలోనికి అనుమతివ్వాలంటే ప్రస్తుతం చేసుకున్న భార్యకు విడాకులు ఇస్తే అప్పుడు గుడిలోకి రానిస్తామంటూ కులపెద్దలు కండీషన్​ పెట్టారు. దీనికి గ్రామానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు సైతం ఓట్ల రాజకీయం కోసం ఒక్క కుటుంబం వైపు మాట్లాడితే తాము మిగితాకులం వారికి దూరమయ్యే అవకాశం ఉందనుకుని కులపెద్దలకే మద్దతు నిలిచారు.

మీ కులపెద్దలు ఒప్పుకోవడం లేదు!
ఆధునిక కాలంలోనూ ఇలాంటి అటవిక తీర్పులు ఏమిటంటూ భరత్​ కుటుంబసభ్యులు తాడూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. కులాంతర వివాహం చేసుకున్న పాపానికి తమకు గుడిలోకి అనుమతి లేదని, అనుమతి కావాలంటే చేసుకున్న అమ్మాయికి విడాకులు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని భరత్ పోలీసుల దృష్టికితెచ్చాడు. కానీ న్యాయం చేయాల్సిన పోలీసులు సైతం చోద్యం చూస్తూ ‘మీ గ్రామ కులపెద్దలు ఒప్పుకోవడం లేదని, గ్రామస్తులు అందరు కులపెద్దలకు సపోర్ట్ గా ఉన్నారని’ చెప్పుకొస్తున్నారు. చట్టం ప్రకారం పనిచేయాల్సిన పోలీసులు సైతం బలం, బలగం ఎక్కడ ఎక్కువ ఉంటే వారి వైపే మద్దతుగా ఉండటంతో ఫిర్యాదు చేసిన బాధితులు న్యాయం కోసం నిట్టూర్చుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని పలువురు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్​ చేస్తున్నారు.