- ఆగ్రహం వ్యక్తంచేసిన సభ్యులు
- ఎంపీటీసీల పాత్ర ఉత్సవ విగ్రహాలే
- హాజరుకాని అధికారులపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
సారథి న్యూస్, మానవపాడు: రేషకార్డులు రాలే, మూడేళ్లు గడిచినా ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు కాకపోతే గ్రామాల్లో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉండి ఏమి చేయాలని ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మూడునెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశం ఎందుకోసమని, సమావేశానికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలని సభ్యులు తీర్మానించారు. మంగళవారం ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డి అధ్యక్షతన మానవపాడు మండల జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. మూడేళ్లు గడిచినా ఒక్క చిన్న బ్రిడ్జి కూడా వేయలేదని, రవాణా సౌకర్యం చాలా ఇబ్బందిగా మారిందని ఆర్అండ్ బీ అధికారి మహేష్ పై పల్లెపాడు సర్పంచ్ విజయలక్ష్మీ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి మాత్రమే వస్తారని మళ్లీ ఎప్పుడు కనిపించరని మండిపడ్డారు. పనులు ఎలా చేయిస్తున్నారో అలాగే బిల్లులు చేయించాలని, గ్రామాల్లో వేసిన సీసీరోడ్లకు బిల్లులు కాకపోవడంతో అప్పుల పాలవుతున్నామని సర్పంచ్‌లు ఏఈ నరేంద్ర తీరుపై మండిపడ్డారు. చెన్నిపాడు గ్రామంలో విద్యుత్ ట్రాన్సఫార్మర్ తొలగించాలని రెండేళ్లుగా సమావేశంలో చర్చిస్తున్నా పట్టించుకోవడంలేదని విద్యుత్ ఏఈ సుబ్బరాయుడుపై ఎంపీటీసీ సభ్యుడు స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్డీఎస్ రైతులకు ప్రధాన వరదాయిని అని అలాంటి ఆర్డీఎస్ కాల్వను అధికారులు పట్టించుకోకపోవడం, సాగునీరు ఎప్పుడు వదులుతారో.. వారబంధీ ఎప్పుడు ప్రకటిస్తారో కూడా రైతులకు చెప్పకపోవడం విడ్డూరంగా ఉందని అధికారిపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీటీసీలకు బడ్జెట్ కేటాయించి గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, వీటిపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరగాలని కోరారు. ఎంపీటీసీ సభ్యులను ఉత్సవ విగ్రహాల మాదిరిగా చేయొద్దని విజ్ఞప్తి చేశారు. జనరల్‌బాడీ మీటింగ్‌కు హాజరయ్యే ముందు ప్రతి ఎజెండాను సభ్యులకు అందజేయాలని లేనిపక్షంలో సమావేశం నిర్వహించబోమన్నారు. నాలుగు సర్వసభ్య సమావేశాల్లో ఒకే ఎజెండాను రూపొందించి సమావేశాన్ని కొనసాగించడం సిగ్గుగా ఉందని ఆర్ అండ్బీ, ఆర్డీఎస్ అధికారుల పనితీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమణరావు, తహసీల్దార్ వరలక్ష్మి ఎంఏవో శివప్రసాద్, సహకార సంఘం చైర్మన్ శ్రీధర్ రెడ్డి, ఈవోపీఆర్డీ ఆంజనేయరెడ్డి, వైద్యులు డాక్టర్ ఇర్షద్, డాక్టర్ దివ్య, వ్యవసాయాధికారి శ్వేత, ఏపీఎం ఎల్లప్ప, డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్, పీఆర్ ఏఈ నరేంద్ర, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.