Breaking News

ఏ ముఖంతో ఓట్లడుగుతున్నవ్​ !

ఏ ముఖంతో ఓట్లడుగుతున్నవ్!

  • యువతను మరోసారి మోసం చేసేందుకు కుట్ర
  • ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరి

సారథి న్యూస్, మహబూబ్​నగర్: నిరుద్యోగుల ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి ఏనాడూ మాట్లాడని వ్యక్తులు గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతున్నారని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్​ స్థానం గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరి ప్రశ్నించారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి మరోసారి నిరుద్యోగ యువతను మోసం చేసేందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం మహబూబ్​నగర్ ​జిల్లా జడ్చర్లలో వంచిత్ ​బహుజన​ అగాడీ పార్టీ, బహుజన, యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముకురాల శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల్లో ఇంగ్లిష్​చదువులు వద్దని, ఎన్​క్యూపీని వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్​నాగేశ్వర్​ఏ ముఖంతో ఆ విద్యాలయాల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. గురుకులాలకు సెక్రటరీగా ఐపీఎస్​ ఆఫీసర్ ​ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ ​అవసరం లేదని నాగేశ్వర్ ధర్నా చేశారని గుర్తుచేశారు. గురుకుల యూనివర్సిటీని ఆయన వ్యతిరేకించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులు నాణ్యమైన ఉన్నతవిద్య అందకూడదని భావించి సీఎం కేసీఆర్ కుట్రపూరితంగా ఐదు ప్రైవేట్​ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తే ప్రొఫెసర్​ నాగేశ్వర్ ​ఓ మేధావిగా నోరు మెదపలేదన్నారు. ప్రైవేట్​ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయడం లేదని, ఫీజురీయింబర్స్​మెంట్ లేదని అయినప్పటికీ నాగేశ్వర్ ఎందుకు పోరాటం చేయలేదో చెప్పాలన్నారు. లక్షా ముప్పైవేల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి కేటీఆర్​ తప్పుడు లెక్కలు ప్రకటిస్తే.. ఎక్కడ ఇచ్చారో ఒక్కమాట కూడా అడగలేదన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరికి మద్దతు ప్రకటిస్తున్న వంచిత్ ​బహుజన​ అగాడీ పార్టీ, బహుజన, యువజన, విద్యార్థి సంఘాల నాయకులు

వ్యవసాయశాఖలో రెండొందల మంది నకిలీ ఉద్యోగులు ఉన్నారని, విచారణ జరిపి వారందరినీ తీసివేయడంతో పాటు కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. వారికి వంతపాడుతున్న అధికారులను ఇంటికి పంపించాలని కోరారు. వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్​రెడ్డి స్పందించి వ్యవసాయశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరారు. నోటిఫికేషన్​ ద్వారా సంబంధిత ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. ఓట్లు వేసి తనను గెలిపిస్తే నిరుద్యోగుల తరఫున ఆమరణదీక్ష చేస్తానని మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఆ పని ముందే చేయలేరా? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దని హితవు పలికారు. టీఆర్ఎస్ కు గ్రాడ్యుయేట్లను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్​రావు నిరుద్యోగుల సమస్యల పట్ల ఏనాడూ పోరాటం చేయలేదని వివరించారు. అన్ని అర్హతలు ఉన్న తనను గెలిపిస్తే ప్రజలు, రైతులు, నిరుద్యోగ యువత, ఉద్యోగులు, అధ్యాపకులు, ఉపాధ్యాయుల తరఫున మండలిలో తన వాణి వినిపిస్తానని ముకురాల శ్రీహరి స్పష్టం చేశారు. కార్యక్రమంలో వంచిత్ ​బహుజన ​అగాడీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్, నాయకులు బండి విజయ్​కుమార్, జైభీమ్ ​యూత్ ​ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు జంతుక శంకర్, రాజేందర్, ఓయూ విద్యార్థి నేత మల్లేష్​యాదవ్, అనిల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.