Breaking News

బాబోయ్ పులి..!

బాబోయ్ పులి..!
  • కీమ్యాతండాలో ఆవు దూడపై దాడి
  • రాత్రివేళ అటవీప్రాంతంలో గాండ్రింపులు
  • హడలిపోతున్న రైతులు, గ్రామస్తులు
    సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కీమ్యాతండా పరిసర అటవీ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా పులి.. రైతులు, గ్రామస్తులను భయపెడుతోంది. రాత్రివేళ ఈ అటవీ మృగం గాండ్రింపులతో హడలిపోతున్నారు. తాజాగా కీమ్యాతండాకు చెందిన పరుశ అనే రైతుకు చెందిన పశువులపై పులి దాడిచేసి ఆవు దూడను చంపేసింది. కాగా, కొద్దిరోజులుగా రాత్రిపూట పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయని చెబుతున్నారు. సమీప రైతుల పొలాల్లో ఇటీవల పులి జాడలను కూడా గుర్తించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం యాసంగి వరి కోతలు, వేరుశనగ నూర్పిళ్లు జరుగుతుండటంతో బోరుబావుల వద్దకు వెళ్లాలంటేనే రైతన్నలు హడలిపోతున్నారు. కాగా, వర్షాభావ పరిస్థితుల కారణంగా అడవి ప్రాంతాల్లో మేత దొరక్కపోవడం, తాగునీళ్లు కూడా లేకపోవడంతో పులులు ఇలా రైతుల పొలాల వద్ద వస్తున్నాయని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు తక్షణమే స్పందించి పులిని బంధించి ఈ ప్రాంతం నుంచి తరలించాలని రైతులు, పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.