సారథి, అచ్చంపేట: మహబూబాబాద్ జిల్లాలో గిరిజన బాలికపై అత్యాచారం, హత్యచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర ఈశ్వర్ లాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి తక్షణం ఆదుకోవాలని కోరారు. ఆదివారం అయన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని గిరిజన భవన్ లో మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం ధర్మరాంతండాకు చెందిన గిరిజన బాలిక ఉషను కిరాతకంగా హత్యచేశారని, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కేవలం పత్రిక ప్రకటనలకే పరిమితం కాకుండా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ సహాయం అందించి, సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయించాలన్నారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన సంఘాలను కలుపుకుని న్యాయపోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఐదారు ఏళ్ల నుంచి గిరిజనులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం తగిన విధంగా స్పందించడం లేదు. బాధిత కుటుంబాలకు ఎలాంటి నష్టపరిహారాన్ని కూడా ఇవ్వడం లేదన్నారు. ఇలాంటి సంఘటనలపై కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రులు, గిరిజన శాఖకు సంబంధించిన అధికారులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బాధితులకు భరోసా ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని లంబాడీ హక్కుల పోరాట సమితి, స్టార్స్ టీం ఓయూ ప్రభుత్వాన్ని కోరింది.