Breaking News

దళిత విద్యార్థిని హత్యా? ఆత్మహత్యా?

దళిత విద్యార్థి హత్యా? ఆత్మహత్యా?

  • నీట్ ​కోచింగ్​కు వెళ్లిన విద్యార్థిని హాస్టల్​ నుంచి మిస్సంగ్​
  • బుక్ ​కోసం వెళ్లి రైలుపట్టాలపై మాంసపు ముద్దగా యువతి
  • మృతురాలు మహబూబ్​నగర్ ​ప్రతిభ కాలేజీ విద్యార్థిని
  • ‘పెద్దల’ కళాశాలలో పేద తల్లిదండ్రులకు దొరకని సమాధానం
విద్యార్థిని మాధవి(ఫైల్ ఫొటో​), రైలుపట్టాలపై తల

సామాజికసారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: తల్లిదండ్రులకు ఒక్కగానొక కూతురు.. డాక్టర్ ​కావాలన్నది ఆమె చిన్ననాటి కల. తెలివి.. చురుకుదనం.. ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు తన కూతురును చదువులో ప్రోత్సహించారు. ఎంతో గొప్పగా చూడాలని కలలుగన్నారు. తాము రెక్కలు ముక్కలు చేసుకొని కాయకష్టం చేసినా సరే బిడ్డను ఉన్నత చదువులు చదివించాలని భావించారు. కూతురు కోరిన విధంగా నీట్ లాంగ్​టర్మ్ ​కోచింగ్ ​కోసం కాలేజీలో చేర్పించారు. హాస్టల్​కు వెళ్లిన బిడ్డ రైలు పట్టాలపై మాంసపు ముద్దగా మారింది. ప్రాణానికి ప్రాణంగా.. అల్లారుముద్దుగా పెంచిన కూతురు విగతజీవిగా మారడం చూసి అమ్మానాన్నల గుండె ఆగిపోయినంత పనైంది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ఈనెల 1వ తేదీన వెలుగుచూసింది. ఈ దారుణం జరిగి మూడు రోజులుగా గడిచినా దర్యాప్తు జరగకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బాధితులు, పోలీసుల కథనం మేరకు.. నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన బోనాసి గోపాల్, సుమిత్రకు ఇద్దరు సంతానం కాగా, మాధవి(18) పెద్దకూతురు. పదవ తరగతి వరకు మహబూబ్​నగర్​లోనే చదివింది. ఇంటర్మీడియట్ నాగర్​కర్నూల్​లో పూర్తిచేసింది. భార్యాభర్తలు కష్టపడి.. తమ పిల్లలను చదివిస్తున్నారు. డాక్టర్ ​కావాలన్న గొప్ప లక్ష్యంతో నీట్​లో టాంగ్​టర్మ్ కోచింగ్​తీసుకోవాలని ఏడాదికి రూ.లక్ష ఫీజు చెల్లిస్తూ మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ ​కాలేజీలో చేరింది. ఇక్కడే కాలేజీకి సంబంధించిన హాస్టల్​లో ఉంటోంది. జనవరి 8న సంక్రాంతి పండగకు సెలవులు ఇవ్వడంతో సొంతూరైన పాలెం వెళ్లింది. తిరిగి గతనెల 31న కాలేజీ తెరవడంతో వచ్చి చేరింది. సాయంత్రం 4:30 గంటల సమయంలో బుక్​ తెచ్చుకుంటానని చెప్పి కొద్దిదూరంలో ఉన్న హాస్టల్​కు వెళ్లింది. అటుగా వెళ్లిన మాధవి కనిపించలేదు. సాయంత్రం 5 గంటల వరకు చూసి కాలేజీ యాజమాన్యం పేరెంట్స్​కు ఫోన్ ​చేసి చెప్పింది. ఆమె తల్లిదండ్రులు గోపాల్, సుమిత్ర ఊరు నుంచి హుటాహుటినా వచ్చి తమ బంధువులు, తెలిసిన వారి ఇళ్లల్లో ఆచూకీ కోసం ఆరాతీశారు. తీరా ఎక్కడా సమాచారం దొరకలేదు. తమ బిడ్డ ఎక్కడుందోనని తల్లిదండ్రుల్లో దిగులు మొదలైంది. ఇంతలోనే ఈనెల 1న మహబూబ్​నగర్​రైల్వే పోలీసుల నుంచి ఫోన్​ వచ్చింది.. తమ కూతురు ఆచూకీ దొరికిందేమోనని భావించారు. అంతలోనే హృదయం పగిలే వార్త.. మీ కూతురు మాధవి రైలుపట్టాలపై మాంసపు ముద్దగా మారిందని చెప్పడంతో ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయింది. ఈ విషాదం నుంచి ఇంకా తేరుకోలేదు.

ఎన్నో అనుమానాలు
ప్రతిభ కాలేజీ హాస్టల్​నుంచి వెళ్లిన విద్యార్థిని మాధవి రైలుపట్టాలపై శవంగా మారడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీ వద్ద సీసీ ఫుటేజీలో అమ్మాయి వచ్చివెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అలా వెళ్లిన విద్యార్థిని ఎక్కడికి వెళ్లిందో ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. మాధవి మృతదేహంపై గాట్లు ఉన్నాయి. చెవి దుద్దులు, మెడలో ఉన్న గొలుసు మాయమైంది. ఓ కాలు ఓ చోట.. బాడీ మరోచోట పడి ఉంది. తల ఇంకొకచోట పడి ఉంది. విద్యార్థిని మాధవిని హత్యాచారం చేసి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మాయిలు చదువుతున్న కాలేజీ హాస్టల్​లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. పైగా కాలేజీకి గుర్తింపు లేదు. యాజమాన్యం కూడా నిర్లక్ష్యపు సమాధానం చెబుతోంది. తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా ఏం జరిగిందో తెలియదనే సమాధానం వస్తోంది. పోలీసుల దర్యాప్తులో కూడా పురోగతి కనిపించడం లేదు. జిల్లాకు చెందిన అధికార పార్టీ ముఖ్యనేతల బంధువులకు సంబంధించిన కాలేజీ కావడంతో పోలీసులు ఈ కేసును అంత సీరియస్​గా తీసుకోవడం లేదని స్పష్టమవుతోంది. రైలు పట్టాలపై ఆత్మహత్య కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తమ కూతురు పిరికిది కాదని సూసైడ్​చేసుకోదని, బిడ్డ మరణం వెనక ఉన్న మిస్టరీని ఛేదించాలని మృతురాలు మాధవి తల్లిదండ్రులు గోపాల్, సుమిత్ర మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులను వేడుకుంటున్నారు.