Breaking News

రైతుల ఇబ్బందులకు కారణం బీజేపీ ప్రభుత్వమే

రైతుల ఇబ్బందులకు కారణం బీజేపీ ప్రభుత్వమే
  • పార్లమెంట్ లో స్పస్టమైన ప్రకటన చేయాలి
  • మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి

 సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వామేనని, వారి మనోవేదన సీఎం కేసీఆర్ కు ప్రతిబింబంలాంటిదని శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉద్ఘాటించారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని గుత్తా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ ధాన్యం ఇంకా 50 శాతం ఎఫ్సీఐ గోదాముల్లోనే ఉందని, కేంద్ర ప్రభుత్వం రైల్వే వ్యాగన్లు ఏర్పాటు చేసి వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని, పార్లమెంట్ లో కేంద్రం ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. స్థానిక సంస్థలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.  రాష్ట్రంలోని ప్రతినిధులందరికీ గౌరవ వేతనాన్ని సీఎం కేసీఆర్  భారీగా పెంచారని చెప్పారు. బీజేపీ నాయకులు కేసీఆర్ ను రైతు హంతకుడని వ్యాఖ్యానించడం సరైంది కాదని, రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేసి 750 మంది చావు కారణమైందెవరో దేశప్రజలందరికీ తెలుసని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలన్నారు.  ఈ నెల 10 వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఎంసీ కోటిరెడ్డిని గెలిపించాలని ఆయన స్థానిక సంస్థల ప్రతినిధులను కోరారు. రైతుల సంక్షేమం విషయంలో దేశంలోనే సీఎం కేసీఆర్ మార్గదర్శకంగా నిలుస్తున్నారని కొనియాడారు. సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.