Breaking News

కారుకొండలో కీచకుడు!

కారుకొండలో కీచకుడు!

  • అధికార పార్టీ నేత ఆగడాలు
  • ‘కొడుకు పవర్’ మాటున తండ్రి అరాచకాలు
  • ఫిర్యాదు చేసినా నమోదుకాని కేసులు

సామాజిక సారథి, బిజినేపల్లి: ప్రజలకు సేవచేస్తాడనే ఉద్దేశంతో అతని గ్రామస్తులు ప్రజాప్రతినిధిగా గెలిపించారు. మంచి చేస్తారనుకుంటే మనుషులపైనే తిరగబడుతున్నాడు. గెలిచిన తర్వాత ఆయన గారి కుటుంబసభ్యులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజలను భయపెట్టేస్థాయికి చేరారు. అడ్డొచ్చేవారిపై దాడులు.. దూషణలతో భరితెగింపులకు పాల్పడుతున్నారు. గ్రామంలో జరిగే సంఘటనలపై పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదులుచేసినా పట్టించుకునేవారు లేరు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఆయనతో పాటు అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సైతం వెనకాడుతున్నారు.

ఇదీ నాగర్​కర్నూల్ ​జిల్లా కారుకొండ గ్రామంలో ఓ ప్రజాప్రతినిధి సాగిస్తున్న అరాచరిక పాలన. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భార్యపై సదరు ప్రజాప్రతినిధి తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో అతడిని నిలదీయడంతో సదరు ప్రజాప్రతినిధి కుటుంబసభ్యులు బాధితుడిపై తిరిగి దాడిచేసి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదుచేసి కేసు పెట్టించాడు. ఈ దారుణ ఘటనపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినప్పటికీ సదరు ప్రజాప్రతినిధిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే బాధితుడి భార్య అకౌంట్ లో నుంచి భర్తకు తెలియకుండా సుమారు రూ.30 లక్షలకుపైగా సదరు ప్రజాప్రతినిధి తండ్రి డబ్బులు డ్రా చేశాడు. గతంలో గ్రామపంచాయతీలో జరిగిన అభివృద్ధి పనులపై బీజేపీ కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా వివరణ అడిగినందుకు అతనిపై దాడిచేశారు. సదరు కార్యకర్త పొలంలో తెలియని వ్యక్తుల శవాలను పూడ్చిపెట్టడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అతనిపై పోలీసులు సైతం కేసులు నమోదు చేసేందుకు వెనకాడుతున్నారు. దీంతో గ్రామంలో సదరు ప్రజాప్రతినిధి కుటుంబానికి ఎదురులేకుండా పోయిందని గ్రామస్తులు భయపడుతున్నారు. అఘాయిత్యాలకు అడ్డుకునే పోలీసులు కూడా చూస్తూ ఉండటం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు మండిపడుతున్నారు.