Breaking News

కాశ్మీర్‌లో ఉగ్రవాది హతం

కాశ్మీర్‌లో ఉగ్రవాది హతం
  • బలగాలపై దాడి కుట్రకు యత్నం
  • స్థానికుల సాయంతో ఏరివేత

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో భద్రతా బలగాలు పాక్‌ ఉగ్రవాది అబూజరార్‌ను మంగళవారం హతమార్చాయి. జరార్‌ భద్రతా బలగాలపై దాడులకు వ్యూహరచన చేస్తున్న తరుణంలో కశ్మీర్‌ పోలీసుల సహకారంతో సైన్యం నిర్వహించిన ‘క్లినికల్‌ ఆపరేషన్‌’లో హతమయ్యాడు. రాజౌరీ పూంచ్‌ ప్రాంతంలో తీవ్రవాదాన్ని పునరుద్ధరించే పనిలో ఉన్న జరార్‌ను హతమార్చడం భద్రతా బలగాలకు భారీ విజయమని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు అన్నారు. పూంచ్‌, రాజౌరీ బెల్టులోని నియంత్రణ రేఖ వెంట హతమైన ఎనిమిదో ఉగ్రవాది అబూజరార్‌. గతనెలలో ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సహకరిస్తున్న హాజీ ఆరిఫ్‌ అనే టెర్రరిస్ట్‌ గైడ్‌ను భద్రతా బలగాలు హతమార్చాయి. పీర్‌ పంజాల్‌ ప్రాంతంలోని దక్షిణ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించడం, స్థానిక యువకులను ఉగ్రవాదంలోకి ఆకర్షించడం జరార్‌ బాధ్యత అని అధికార వర్గాలు గుర్తించాయి.

అనుమానితుల కదలికల కీలక సమాచారం

పీర్‌ పంజాల్‌ దక్షిణ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించడానికి పాక్‌ చేస్తున్న ప్రయత్నాల్లో ఓ భాగమని, తీవ్రవాదితో పాటు అతని సహచరుడు గతకొద్ది నెలలుగా అడవిలో ఆశ్రయం పొందుతూ పరారీలో ఉన్నాడన్నారు. అయితే, ఆహారం, దుస్తులు, కమ్యూనికేషన్‌ తదితర అవసరాల కోసం ప్రజలను సంప్రదించాలని వచ్చారని సదరు అధికారి తెలిపారు. పోలీసులతో కలిసి భారత సైన్యం తన మొబైల్‌ కమ్యూనికేషన్‌ను రియల్‌ టైమ్‌ ప్రాతిపదికన పర్యవేక్షించిందని, అనుమానితుల కదలికలపై స్థానికులు కీలకమైన సమాచారం అందించారని చెప్పారు. చలికాలం ప్రారంభమైనప్పటి నుంచి పీర్‌ పంజాల్‌ పర్వతశ్రేణులకు దూరంగా ఉగ్రవాదులు ఉండాల్సి వచ్చిందని, బెహ్రామ్‌గాలా ప్రాంతంలోని స్థానికుల నుంచి వచ్చిన నిర్ధిష్ట సమాచారం మేరకు సైన్యం, పోలీసులు క్లినికల్‌ ఆపరేషన్‌ను ప్రారంభించాయని ఆయన వివరించారు. భద్రతా బలగాలపై కాల్పులు జరిపి ఉగ్రవాదులు తప్పించుకునేందుకు ప్రయత్నించారని, అయితే ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడని, అతని సహచరుడు పరారీలో ఉన్నాడని ఆయన చెప్పారు. అతని నుంచి ఏకే 47 రైఫిల్‌తో పాటు నాలుగు మ్యాగజైన్లు, గ్రనేడ్‌, కొంత భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులతో ఉగ్రవాదికి పాక్‌ సహకరించినట్లు స్పష్టంగా తెలుస్తోందని తెలిపారు.