Breaking News

నింగికేగిన పోరుకెరటం

నింగికేగిన పోరుకెరటం

  • తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత
  • నిజాంసర్కారును వణికించిన ధీరవనిత
  • బతుకమ్మ పాటలతో ప్రజల్లో చైతన్యం
  • కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం
  • రేపు నల్లగొండలో అంత్యక్రియలు

సామాజికసారథి, హైదరాబాద్‌: సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెంలో ఓ భూస్వామ్య కుటుంబంలో 1931లో మల్లు స్వరాజ్యం జన్మించారు. ఐదో తరగతి వరకే చదువుకున్నారు. తన సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి అడుగుజాడల్లో పోరాటపంథాలోకి వచ్చారు. 1945-48 మధ్య కాలంలో మహోజ్వలంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి ఎందరో మహిళలకు ప్రేరణగా నిలిచారు. గ్రామాల్లో పెద్దఎత్తున ప్రజలను కదిలించేలా సభలు నిర్వహించేవారు. నాటి రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా బతుకమ్మ పాటలతో ఉర్రూతలూగించే ఉపన్యాసాలతో మహిళలను చైతన్యపరచడంలో కీలకపాత్ర పోషించారు. నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి, రజాకార్ల పాలిటి సింహస్వప్నమై నిలిచారు. సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించి నైజాం సర్కారును గడగడలాడించారు. ఈమె పోరాటాల ధాటికి తట్టుకోలేక వారి ఇంటిని దగ్ధం చేశారు. మల్లు స్వరాజ్యం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు, రైతు కూలీలు, మహిళల్లో చైతన్యం చేశారు. సాయుధ పోరాట కాలంలో మల్లు స్వరాజ్యంతో పాటు మూడువందల మంది మహిళలు మేజర్ జైపాల్ సింగ్ ఆధ్వర్యంలో సాయుధ శిక్షణ పొంది నిజాం రజాకార్లపై విరుచుకుపడ్డారు.

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో మల్లు స్వరాజ్యం(ఫైల్​)

ప్రజల నేతల గుర్తింపు
75 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ, ప్రజాప్రస్థానంలో ఆమె రెండుసార్లు(1978, 1983లో) తుంగతుర్తి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) నాయకురాలిగా అనేక మహిళా సమస్యలపై పోరాటాలు చేశారు. కాగా, మల్లు స్వరాజ్యం భర్త మల్లు వెంకట నర్సింహారెడ్డి(వీఎన్‌) ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శిగా, నల్లగొండ జిల్లా సీపీఎం కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 2004 డిసెంబర్ 4న చనిపోయారు. వారికి కూతురు పాదూరి కరుణ, ఇద్దరు కుమారులు మల్లు గౌతంరెడ్డి (డాక్టర్), మల్లు నాగార్జునరెడ్డి (న్యాయవాది) ఉన్నారు. కూతురు బీజేపీలో ఉండగా.. చిన్నకుమారుడు నాగార్జునరెడ్డి సూర్యాపేట జిల్లా సీపీఎం కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మల్లు స్వరాజ్యం అంత్యక్రియలు ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు సీపీఎం నాయకులు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఇటీవలే సీపీఎం నేత బీవీ రాఘవులు, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డితో పాటు పలువురు ఆస్పత్రికి వచ్చి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడారు. అంతలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

కేరళ సీఎం పినరయ్​ విజయన్​తో మల్లు స్వరాజ్యం(ఫైల్​)