Breaking News

సిద్దిపేట లెక్కనే నల్లగొండ కావాలె

సిద్దిపేట లెక్కనే నల్లగొండ కావాలె
  • హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలి
  • దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలె
  • లాండ్ పూలింగ్ చేపట్టి కాలనీలు నిర్మించాలి
  • అద్భుతంగా టౌన్​హాల్, మినీ ట్యాంక్​బండ్​
  • నిబద్ధతతో పనిచేసే కమిషనర్ ను నియమించండి
  • ప్రాజెక్టు కాలనీవాసులకు ఇళ్లపట్టాలు
  • నల్లగొండ అభివృద్ధిపై సీఎం కేసీఆర్​సమీక్ష
  • ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుటుంబానికి
  • ముఖ్యమంత్రి, మంత్రుల పరామర్శ

సామాజికసారథి, నల్లగొండ ప్రతినిధి: రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా పురోభివృద్ధి చెందాలని, నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని, ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని సీఎం కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. నల్లగొండ పట్టణాన్ని అన్ని హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలని, ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయిస్తుందని, అందుకు తక్షణమే కార్యాచరణకు పూనుకోవాలని ఆదేశించారు. సిద్దిపేట మాదిరిగానే నల్లగొండనూ తీర్చిదిద్దాలని సూచించారు. నల్లగొండ పర్యటనలో భాగంగా బుధవారం పట్టణానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తండ్రి గాదరి మారయ్య దశదిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ దంపతులతో పాటు ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. మారయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సహపంక్తి భోజనంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్​లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​మాట్లాడుతూ.. నల్లగొండ అభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఇక్కడ నిబద్ధతతో పనిచేసే మున్సిపల్ కమిషనర్ ను వెంటనే నియమించాలని ఆదేశించారు. ఈ మేరకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారిని నల్లగొండకు వచ్చి పనిచేయాలని ఫోన్​లో ఆదేశించారు. స్ట్రీట్ లైట్ల పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు కరెంట్​సరఫరా పరిస్థితిని మెరుగుపరిచేందుకు వెంటనే కావాల్సినన్ని సబ్ స్టేషన్లు నిర్మించాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అనువైన స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, రైతుబజార్లు నిర్మించాలని సూచించారు. ఉదయసముద్రం అద్భుతమైన నీటి వసతితో కళకళలాడుతున్న నేపథ్యంలో ట్యాంక్ బండ్ ను సుందరీకరించాలని కోరారు. అధునాతన సౌకర్యాలతో రెండువేల మంది సామర్థ్యంతో కూడిన టౌన్ హాల్ నిర్మించాలని ఆదేశించారు. అందుకోసం నగరం నడబొడ్డున అనువైన ప్రభుత్వస్థలాన్ని గుర్తించాలని స్థానిక ఎమ్మెల్యేను, జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు.

టౌన్​హాల్ స్థలపరిశీలన

నల్లగొండలో జనాభా పెరుగుతున్నందున పాదచారుల కోసం ఫుట్ పాత్ లు నిర్మించాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు. ఉప్పల్ భగాయత్ మాదిరిగా లాండ్ పూలింగ్ చేపట్టి కాలనీల నిర్మాణానికి పూనుకోవాలని సూచించారు. గతంలో నల్లగొండ పట్టణంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉండేదని, మిషన్ భగీరథ పథకంతో ఆ సమస్య తీరిపోయిందని అధికారులు సీఎంకు వివరించారు. నల్లగొండలో డబుల్ బెడ్​రూమ్​ఇళ్ల పురోగతిపై సీఎం కేసీఆర్​ఆరాతీశారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులకు వేర్వేరుగా శ్మశాన వాటికలను నిర్మించాలని సూచించారు. అనంతరం నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ లో ఉన్న ఇరిగేషన్, ఆర్అండ్ బీ కార్యాలయాలను టౌన్​హాల్​నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించారు.

ప్రాజెక్టు కాలనీవాసులకు ఇళ్లపట్టాలు

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా అక్కడే నివాసం ఏర్పరచుకున్న కాలనీవాసులతో పాటు నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో ప్రాజెక్టుల కింద కూడా ఈ సమస్యలు ఉన్నాయని, అక్కడ కూడా అర్హులైన వారికి పట్టాలిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యలను పరిష్కరించి శాశ్వతపట్టాలు ఇవ్వాలని ఆదేశించారు. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఫోన్​లో ఆదేశించారు. ‘మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవడం ధర్మమని, మనది ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం’ అని ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా తొలగిపోయినందున అర్హులైన సాగర్ కాలనీవాసులకు పట్టాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

దశాబ్దాల క్రితం ప్రాజెక్టుల నిర్మాణాల సందర్భంగా పేదకూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలే అధికంగా పాల్గొన్నారని, వారు ఇక్కడే నివాసం ఉంటున్నారని తెలిపారు. అలాంటిదే ఇక్కడ కూడా నాగార్జునసాగర్ మున్సిపాలిటీగా ఏర్పడిందని గుర్తుచేశారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ నల్లగొండకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, హరీశ్​రావు, వి.శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్రనాయక్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, నోముల భగత్, ఎన్.భాస్కర్ రావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రెమా రాజేశ్వరి, మున్సిపల్ చైర్మన్ ఎం.సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, అడిషనల్​కలెక్టర్లు రాహుల్ శర్మ, వి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.