Breaking News

రైతుబంధు 10రోజుల్లో..

రైతుబంధు 10రోజుల్లో..
  • రైతులకు గుడ్​న్యూస్​
  • 15వ తేదీలోగా రైతుల ఖాతాల్లోకి
  • అవసరమయ్యే నిధి రూ.7,500కోట్లు 
  • అధికారులకు సీఎం కేసీఆర్​ఆదేశాలు
  • సిద్ధంచేస్తున్న వ్యవసాయ, ఆర్థికశాఖలు
  • వానాకాలంలో 60.84 లక్షల మందికి పంపిణీ

సామాజిక సారథి, హైదరాబాద్: రాష్ట్ర రైతులకు గుడ్ న్యూస్.. యాసంగిలో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు డబ్బు త్వరలోనే చేతికి రానుంది.  యాసంగి సీజన్ పంట సాగు ఇప్పటికిప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరో 10రోజుల్లో రైతుబంధు నిధులు పంపిణీ చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్​ఆదేశాలు ఇచ్చారు. ఎకరానికి ఐదువేల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు రూ7,500 కోట్లు నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. డిసెంబర్ 15 నుంచి అంటే మరో పదిరోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన ఆదేశాల మేరకు నిధులు సర్దుబాటుపై ఆర్థికశాఖ ఇప్పటికే దృష్టి సారించింది. ఈ విషయంపై టీఆర్ఎస్ ఎంపీలతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్​గుర్తుచేసినట్లు తెలిసింది. వానాకాలం సీజన్ కు సంబంధించిన జూన్ నెలలో 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు సహాయంగా రూ.7.360.41 కోట్లను ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం1.47 కోటి ఎకరాలకు సంబంధించి నిధులు పంపిణీ చేశారు. అయితే ఈ యాసంగి సీజన్​లో మరింత సాగుపెరిగే అవకాశం ఉంది. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య అందుకు అనుగుణంగా భూమి విస్తీర్ణం పెరిగితే బడ్జెట్ కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలోనే సుమారు కోటిన్నర లక్ష ఎకరాలకు పంపిణీ చేయడానికి రూ.7,500 కోట్లు అవసరం ఉంటుందని వ్యవసాయ, ఆర్థికశాఖలు అంచనా వేశాయి. గత వానాకాలం సీజన్ లో మొదటిరోజు ఎకరా మేర భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండెకరాలు, మూడోరోజు మూడెకరాలు ఉన్న వారికి.. ఆరోహణ పద్ధతిలో బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేశారు. ఈసారి కూడా అదే పద్ధతిలో పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.