- కమలం పార్టీలోకి బీఆర్ఎస్ లీడర్ జక్కా రఘునందన్ రెడ్డి
- నాగర్‌కర్నూల్ మాజీఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
అనుచరుడిగా నియోజకవర్గంలో చక్రం తిప్పిన నేత - బీజేపీలో చేరి జడ్చర్ల రాజకీయాలపై చూపు
సామాజికసారథి, నాగర్‌కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బిగ్ షాక్ తగలనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి కుడి భుజంగా ఉంటూ రాష్ట్రస్థాయి పదవులతో ఓ వెలుగు వెలిగి జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్న బీఆర్ఎస్ లీడర్ జక్కా రఘునందన్ రెడ్డి కమలం గూటికి చేరనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పాటు ఇక్కడి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సైతం ఓటమిపాలు కావడంతో ఆయన ప్రధాన అనుచరులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దీంతో మర్రి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరులు ఒక్కొక్కరు తమ రాజకీయ భవిష్యత్ చూసుకునేందుకు తలో దారి పట్టారు. ఈ నేపథ్యంలో మర్రి జనార్దన్‌రెడ్డి కుడిభుజంగా వ్యవహరించిన జక్కా రఘునందన్‌రెడ్డి సైతం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధంచేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా నాగర్‌కర్నూల్ లో బీఆర్ఎస్ పార్ట లోని ఇతర చోటా మోటా నాయకులు సైతం తమ భవిష్యత్ కోసం బీఆర్ఎస్ ను వీడేందుకు రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేడర్ ను సక్రమంగా చూసుకోవడంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి విఫలం కావడం, కేవలం తన సామాజిక వర్గంలోని కొందరికే ప్రాధాన్యం ఇస్తూ ఇతర నాయకులను గాలికి వదిలేశాడన్న ఆరోపణలు అప్పట్లోనే బలంగా వనిపించాయి. ప్రస్తుతం అధికారం లేకపోవడం, కనీసం ఎమ్మెల్యేగా కూడా మర్రి జనార్దన్ రెడ్డి గెలవకపోవడంతో నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ త్వరలోనే ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌ను వీడి బీజేపీ పార్టీలో చేరిన తర్వాత జడ్చర్ల నియోజకవర్గం రాజకీయాలపై దృష్టి సారించి భవిష్యత్తులో తన రాజకీయ జీవితాన్ని బలంగా నిర్మించుకునేందుకు జక్కా రఘునందన్ రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీలో తనదైనశైలిలో రాజకీయ జీవితాన్ని కొనసాగించిన జక్కా రఘునందన్‌రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుతుండటం విశేషం.