- మతిస్థిమితం లేని వారిపై దాడిచేశాడని యువకుడిపై పోలీసు కేసు
- కాంగ్రెస్ కు చెందిన యువకుడు కావడంతో రెచ్చిపోయిన బీఆర్ఎస్ నేతలు
- పోలీసులపై ఒత్తిడి తెచ్చి పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలు
- కాంగ్రెస్ లీడర్ రాజేశ్వర్ రెడ్డి అనుచరుడు అంటూ రాజకీయ రంగు
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష్యలకు పోలీసులు అత్యుత్సాహంతో అమాయక యువకుడిపై కేసు నమోదుచేసి రిమాండ్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమ కాలనీలో మతిస్థిమితం లేని ఇద్దరు సంచరిస్తూ ఒంటరిగా ఆరుబయట ఉన్నవారిని రాళ్లతో, మద్యం సీసాలతో గాయపరుస్తున్నారని కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కానీ అదే కాలనీలో రాత్రివేళలో తిరుగుతూ కాలనీవాసులను గాయపరుస్తున్న మతిస్థిమితం లేని వారిపై దాడిచేశాడని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు పోలీసులు ఆగమేఘాల మీద స్పందించి కేసునమోదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో కొంతకాలంగా ఇద్దరు వ్యక్తులు (ఒక మగ, ఒక ఆడ) రాత్రి వేళల్లో సంచరిస్తూ ఒంటరిగా ఆరుబయట ఉన్న వారిని రాళ్లు, మద్యం సీసాలతో గాయపరుస్తున్నారు. తాజాగా, ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా అవురాసిపల్లి గ్రామానికి చెందిన సతీష్ గౌడ్.. రాంనగర్ కాలనీలో తన చెల్లెలు ఇంటికి వెళ్లాడు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లోని నీటిని బయట పారబోసేందుకు వెళ్లిన తన చెల్లెలును మతి స్థిమితం లేని వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి మద్యంసీసాతో గాయపరిచాడు. దీంతో భరించలేని నోప్పితో ఏడుస్తూ ఇంట్లోకి వచ్చిన తన చెల్లెలును చూసి సతీష్ గౌడ్ అక్కడే ఉన్న కర్ర తీసుకొని మతిస్థిమితం లేని వ్యక్తిని బెదిరించి అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
రాజకీయరంగుతో తప్పుడు కేసు
తన చెల్లెలు ను గాయపరిచిన మతిస్థిమితం లేని వ్యక్తిని కర్రతో బెదిరించి వెళ్లగొట్టిన సంఘటనకు బీఆర్ఎస్ నాయకులు రాజకీయ రంగు పులిమారు. సతీష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావడంతో ఏకంగా కాంగ్రెస్ లీడర్ రాజేశ్వర్ రెడ్డి అనుచరుడు మతిస్థిమితం లేని వారి పై దాడి చేశారని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ లీడర్లు ట్రోల్ చేశారు. దీంతో నాగర్ కర్నూల్ పోలీసు సైతం నిజనిజాలను తెలుసుకోకుండా అధికార పార్టీ రాజకీయ ఒత్తిడితో సతీష్ గౌడ్ పై కేసు నమోదు చేయడమే గాకుండా పోలీస్ స్టేషన్ లోనే చితకబాదినట్లు తెలిసింది.
కాలనీవాసులు ఏమన్నారు?
ఈ సంఘటనపై రాంనగర్ కాలనీ వాసులు మతిస్థిమితం లేని వ్యక్తులు కొంతకాలంగా ప్రజలను గాయపరుస్తున్నారని, ఆదివారం కూడా అదే సంఘటన జరిగిందని సతీష్ గౌడ్ కావాలని మతిస్థిమితం లేని వారిని కొట్టలేదని పోలీసులకు క్లియర్ గా చెప్పి ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. జరిగిన సంఘటనను బీఆర్ఎస్ నాయకులు రాజకీయ కక్షతో తప్పుదోవ పట్టిస్తున్నారని రాంనగర్ కాలనీ వాసులు నెత్తినోరు మొత్తుకుంటున్నా నాగర్ కర్నూల్ పోలీసులు మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ఒత్తిడికి తలొగ్గినట్లు కనిపిస్తోంది. పూర్తి విచారణ చేయకుండా, రాంనగర్ కాలనీ వాసుల స్టేట్ మెంట్ ను పక్కన బెట్టి తప్పుడు కేసు నమోదు చేయడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మెప్పు కోసం పోలీస్ స్టేషన్ లోనే సతీష్ గౌడ్ ను చిత్రహింసలు పెట్టడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్ రాజేశ్వర్ రెడ్డికి ఈ సంఘటనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయన ప్రధాన అనుచరుడి పేరుతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకులు అత్యుత్సాం ప్రదర్శిస్తూ అమాయక యువకుడిని చిత్రహింసలు పెట్టడం తగదని అంటున్నారు.