Breaking News

‘పాలమూరు– రంగారెడ్డి’ అగమ్యగోచరం

పాలమూరు– రంగారెడ్డి అగమ్యగోచరం

  • సందిగ్ధంలో భారీ ఎత్తిపోతల పథకం
  • ప్రారంభం నుంచీ ప్రాజెక్టుకు అవాంతరాలే
  • తాజాగా పర్యావరణ అనుమతులు లేవని ట్రిబ్యునల్​స్టే
  • నీటి కేటాయింపుల్లేవు.. ప్రాజెక్టుకు అనుమతుల్లేవు
  • నిపుణులు హెచ్చరించినా పట్టించుకోని ప్రభుత్వపెద్దలు

ఇదీ ‘పాలమూరు’ స్వరూపం
ప్రారంభ అంచనా వ్యయం: రూ.50వేల కోట్లు
పెరిగిన అంచనా వ్యయం: రూ.లక్ష కోట్లు
సాగునీటి అంచనా: 10లక్షల ఎకరాలు
పంపులు: 5
పొడవు: 1000 కి.మీ.
ఇప్పటివరకు ఖర్చు: రూ.50వేల కోట్లు

-గంగు ప్రకాశ్​, ప్రత్యేక ప్రతినిధి, సామాజిక సారథి

కరువు ఛాయలు అలుముకున్న పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో కృష్ణాజలాలను పారించి బీడు భూములకు సాగు యోగ్యం కల్పించాలని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగానే పాత డిజైన్​ను మార్చి కొత్త అలైన్​మెంట్​కు శ్రీకారం చుట్టింది. కృష్ణానది నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున కృష్ణానది నుంచి నీటిని తరలించేందుకు డిజైన్​చేశారు. దక్షిణ తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఈ ఎత్తిపోతలకు ఆది నుంచీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. తాజాగా పర్యావరణ అనుమతులు లేవని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించడంతో మరోసారి చర్చనీయాంశమైంది. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లడంతోనే ఈ సమస్య వచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ అనుమతులు పెద్దసమస్య కాదని, అన్నింటిని అధిగమించి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి ప్రతిఎకరాకు సాగునీరు అందించి తీరుతామని ప్రభుత్వ పెద్దలు ధీమాగా చెబుతున్నారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మక్తల్ నియోజకవర్గం నుంచి చేపట్టేలా రూపొందించగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోతిగుండు ప్రాంతం నుంచి నీటిని తరలించేలా రూపకల్పన చేశారు. ఇందులో వివిధ దశల్లో రిజర్వాయర్లను ఏర్పాటుచేసి సుమారు 90 టీఎంసీల నీరు నిల్వఉండేలా రిజర్వాయర్లను రూపొందించారు. ఈ పథకం ప్రారంభంలో రూ.30వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పూర్తవుతుందని భావించిన ప్రభుత్వం ప్రస్తుతం దశలవారీగా వ్యయం పెంచింది. తాజాగా రూ.50వేల కోట్లకు చేరింది. కేవలం నాలుగేళ్లలో ఈ పథకాన్ని పూర్తిచేసి రైతులకు సాగునీటిని అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏడున్నరేళ్లు గడిచినా ఏ ఒక్క రిజర్వాయర్ ద్వారా కూడా సాగునీరు అందించలేదు. ఏడాది క్రితం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ సైతం ఏదుల రిజర్వాయర్ ను పూర్తిచేసి ఈ ఖరీఫ్​లో రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అయినా అది కూడా ప్రారంభానికి నోచుకోలేదు.

ఆదినుంచీ అవాంతరాలే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న సంకల్పంలో గత ప్రభుత్వం చేపట్టిన పథకానికి పూర్తిగా రీడిజైన్ చేసి ఈ ఎత్తిపోతలకు కొత్తరూపు ఇచ్చింది. దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుగా భావించిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలకు ఆదినుంచీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో ఉత్తర తెలంగాణలో ప్రారంభించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీటిని అందిస్తున్నారు. కానీ పాలమూరు లిఫ్ట్​ఇరిగేషన్​స్కీం మాత్రం ఇంకా అనుమతుల వద్దే నిలిచిపోయింది. ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి ఇరురాష్ట్రాల మధ్య జలవివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు లేవని గట్టిగా వాదిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమకు ఉన్న కేటాయింపుల ద్వారా పథకానికి నీటిని వినియోగిస్తామని చెబుతూ వస్తోంది. డీపీఆర్​ను కేంద్రానికి సరైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అందించకపోవడంతో పాటు అటవీ పర్యావరణ అనుమతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు ఉన్నాయి. మొండితనంతో ముందుకెళ్లి అనుమతులు రాకముందే పథకానికి టెండర్లు పిలిచి ప్రారంభించడంతో అసలు సమస్యలు మొదలయ్యాయి. ప్రస్తుతం పర్యావరణ అనుమతులు రాకపోతే పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఖర్చుచేసిన నిధులు వృథా అవడమే కాకుండా పథకం నిర్వీర్యంగా మారిపోతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

డిజైన్ మార్చడంతోనే సమస్య?
పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి ఫేస్ పనులు పూర్తిగా అటవీ ప్రాంతంలో చేపట్టాల్సి రావడంతో కొన్ని లక్షల సంఖ్యలో చెట్లను నరికి వేయాల్సి వస్తోందని, దీంతో అటవీప్రాంతం పూర్తిగా దెబ్బతింటుందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ అభ్యంతరం చెప్పడంతో పాటు కొందరు పర్యావరణ నిపుణులు ఇది అటవీకి పూర్తిగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అండర్ గ్రౌండ్ ద్వారా మొదటి ఫేస్ పనులు చేపట్టినప్పటికీ పూర్తిస్థాయిలో అనుమతులు తీసుకోకపోవడం, మొదటి దశలో అండర్ గ్రౌండ్ పనులు చేపట్టకముందే వివిధ దశల్లో ఉన్న ఫేస్ టు ఫేస్ త్రీ కాల్వలు, రిజర్వాయర్లు నిర్మించడం ద్వారా ఎవరికి ఉపయోగం ఉంటుందని కొందరు సాగునీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పథకానికి మొదట అనుకున్న ప్రకారం అటవీప్రాంతం దెబ్బ తినకుండా ఉండటం ద్వారా అనుమతులు మరింత సులువుగా లభించేవని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేసుకోవడం ద్వారా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్వీర్యమైన స్థాయికి చేరిందని చెబుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్​లో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వాదించకపోవడంతో కృష్ణాజలాల వినియోగంలో పొరుగు రాష్ట్రం పైచేయిగా మారిందని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ ప్రాంత ప్రజలకు ఏం ఉపయోగం జరుగుతుందని ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

కోర్టుకెక్కిన ‘పాలమూరు’ పంచాయితీ
పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా పర్యావరణం దెబ్బతినడమే కాకుండా అటవీప్రాంతం పూర్తిగా నాశనమవుతుందని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గతంలో కోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన టీఆర్ఎస్​లో చేరడంతో తన కేసును వెనక్కి తీసుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన కొందరు రైతులు కోర్టును ఆశ్రయించడంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేవలం ప్రజల తాగునీటి అవసరాలకు మాత్రమే చేపడుతున్నామని ప్రభుత్వం వాదించింది. అయితే ప్రజల తాగునీటి అవసరాల దృష్ట్యా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తాత్కాలిక అనుమతులు ఇచ్చింది. కానీ తాగునీటికి కాదని సాగునీటి పనులు చేపడుతున్నారని కోర్టులో పిల్ దాఖలు చేయడంతో క్షేత్రస్థాయి విచారణ జరిపి ధర్మాసనానికి నివేదికలు అందజేశారు. సాగునీటి కోసం పెద్దఎత్తున రిజర్వాయర్లు నిర్మిస్తున్నారని, రోజుకు మూడు టీఎంసీలు దాదాపు 30 రోజుల పాటు ఎత్తిపోతల ప్రణాళికలు జరుగుతున్నాయని వారు నివేదికలు ఇవ్వడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తాజాగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నవంబర్ 24వ తేదీ వరకు స్టే విధించడంతో పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ట్రిబ్యునల్ ముందు రాష్ట్రప్రభుత్వం తమ వాదనలు సరిగా వినిపించకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.