సామాజిక సారథి, హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో కాకుండా కార్పొరేట్ హాస్పిటల్ ఏఐజీ(ఏషియన్ ఇనిస్టిట్యూట్ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ)లో చేరడం ప్రభుత్వానికి సిగ్గుచేటని జైభీమ్ యూత్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి విమర్శించారు. అత్యున్నతమైన స్థానంలో ఉన్న స్పీకర్ ప్రభుత్వ ఆస్పత్రులపై సామాన్యులకు నమ్మకం కలిగించాల్సింది పోయి ప్రజల సొమ్ముతో కార్పొరేట్ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ డాక్టర్లను అవమానించడమే అవుతుందన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘‘సీఎం కేసీఆర్‌కు ఆరోగ్యం బాగాలేకపోతే యశోద హాస్పిటల్, స్పీకర్ కు కరోనా వస్తే ఏఐజీ ఆస్పత్రికి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర కార్పొరేట్ ఆస్పత్రులకు పోతున్నారు. కొవిడ్ రోగుల చికిత్స కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన టిమ్స్‌లో స్పీకర్ కు వైద్యం చేయించలేరా? కార్పొరేట్ ఆస్పత్రుల్లో తగ్గని కరోనాను గాంధీ హాస్పిటల్లో తగ్గిస్తున్నారని రెండు రోజుల క్రితం ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.’’ అని ముకురాల శ్రీహరి ప్రకటనలో పేర్కొన్నారు.
బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నోసార్లు గాంధీ దవాఖానాలో వైద్యం చేయించుకొని నిజమైన ప్రజల నాయకుడిగా నిలిచారని గుర్తుచేశారు. ప్రభుత్వ దవాఖానాలపై పేదలకు నమ్మకం కలిగించారని పేర్కొన్నారు. వార్డు సభ్యుడి నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకునేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. స్పీకర్‌ను తక్షణమే టిమ్స్ లేదా గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలని కోరారు. వైద్యశాఖ, డాక్టర్లను అవమానపరిచిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.