Breaking News

పత్రికలు.. ప్రజల గొంతుకగా ఉండాలి

ప్రజల గొంతుకగా ప్రతికలు ఉండాలి

సామాజికసారథి, హైదరాబాద్ బ్యూరో​: ‘సామాజికసారథి తెలుగు’ దినపత్రిక 2024 సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. హైదరాబాద్​ లోని ఆయన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, పత్రికలు ప్రజాపక్షం వహించాలని కోరారు. స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఎందరో మహనీయులు పత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారని, మహాత్మాగాంధీ మొదలుకుని ఎందరో మహానుభావులు పత్రికల ద్వారా ప్రజాకోటిని జాగృతం చేశారని గుర్తుచేశారు. సంస్కృతి సంప్రదాయాలు, భాషకు పెద్ద పీట వేయాలన్నారు. వ్యవసాయం, మాతృభాష, మహిళా సాధికారత, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, యువత, నైపుణ్యాభివృద్ధి లాంటి అంశాల మీద ప్రధానంగా పత్రికలు దృష్టిసారించాలని కోరారు. ‘సామాజికసారథి’ ప్రజల పక్షాన ఉండి ఎన్నో సమస్యలను వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఆ పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ‘సామాజికసారథి’ ఎడిటర్​ వెంకట్​, మేనేజింగ్​ డైరెక్టర్​ గంగు ప్రకాష్​, టెక్నికల్​ హెడ్​ సత్యం, పాత్రికేయులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.