Breaking News

ఎమ్మెస్సార్​ ఇకలేరు

ఎమ్మెస్సార్​ ఇకలేరు

  • మాజీమంత్రి ఎం.సత్యనారాయణరావు కన్నుమూత
  • కరోనాతో చికిత్స పొందుతూ నిమ్స్‌లో మృతి
  • కాంగ్రెస్​ దిగ్గజానికి పలువురు నేతల నివాళి

సారథి, రామడుగు​: కాంగ్రెస్ పార్టీ సీనియర్​ నేత, రాజకీయాల్లో విలక్షణనేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ (87) కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చివరిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం కరీంనగర్​జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామం. 1934 జనవరి 14న జన్మించారు. ఉస్మానియాలో ఎల్ఎల్‌బీ చదివారు. యువనేతగా కాంగ్రెస్​ రాజకీయాల్లోకి వచ్చారు. స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ ప్రధాన కార్మదర్శిగా పనిచేశారు. ఇందిర కుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధం ఉండేది. ఎంతో మందికి రాజకీయ మార్గం చూపారు. స్వరాష్ట్ర కల సాకారం కావాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రజాసమితిలో చేరి 1969 ఉద్యమంలోనూ పాల్గొన్నారు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కరీంనగర్ మెదటి మేయర్ డి.శంకర్, నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే జానకిరాం, కోడూరి నత్యనారాయణ గౌడ్ వీరంతా ఎమ్మెస్సార్​ శిష్యరికంలో పెరిగినవారే. ఎంఎస్ఆర్ రెండు దఫాలు ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇంతటి రాజకీయ అనుభవం ఉన్న ఆయన తన వారసులను మాత్రం రాజకీయాలకు దూరంగా పెంచారు. ఆయన ఇద్దరు కుమారులు ప్రస్తుతం వ్యాపారరంగంలో స్థిరపడ్డారు.
సంచలనాలకు మారుపేరు
తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర దేవాదాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఎమ్మెస్సార్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. చిలికి చిలికి గాలి వానలా మారిన ఎమ్మెస్సార్ ప్రకటనలతో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా రాజీనామా చేశారు. రెండులక్షల మెజార్టీతో గెలుస్తానని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ గెలిచిన తర్వాత తన మాటకు కట్టుబడి ఎమ్మెస్సార్ దేవాదాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి సీఎం వైఎస్సార్​ సత్తన్న మీరిలా ఉండడం సరికాదని ఆర్టీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టి కేబినెట్ హోదా ఇచ్చారు.
సీఎం కేసీఆర్ సంతాపం
పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఎమ్మెస్సార్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నాకు వ్యక్తిగతంగా తీరని లోటు: డీఎస్​
కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు మరణం తనకు తీరని లోటని రాజ్యసభ సభ్యులు ధర్మపూరి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెస్సార్​ కుటుంబసభ్యులకు డీఎస్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా తనకు మార్గనిర్దేశం చేశారని తెలిపారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్నివిధాలుగా సహకరించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు కట్టుబడి చివరదాకా ప్రజల కోసం పనిచేసిన ఎమ్మెస్సార్​ ఆత్మకు శాంతి చేకూరాలని డీఎస్​ కోరారు.