- గతంలో ఆరుగురు ఎస్సైల బ్లాక్ మెయిల్
- ఎట్టకేలకు అట్రాసిటీ కేసులో అరెస్ట్
సారథి న్యూస్, ఎల్బీనగర్: అమాయకులకు వలవేసి.. అవసరాలకు వాడుకుంటూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ పబ్బం గడుపుతున్న ఓ మాయ‘లేడీ’ని పోలీసులు గురువారం అరెస్ట్‌చేశారు. పోలీసుల కథనం మేరకు.. వనస్థలిపురం పరిధిలో నివాసం ఉంటున్న ఎలిమినేటి శ్రీలతరెడ్డి స్థానికంగా టైలర్‌షాపు నిర్వహిస్తోంది. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ ఇద్దరు పిల్లలతో కలిసి ఇక్కడే నివాసం ఉంటోంది. కొంతమంది ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారితో గొడవపడింది. ఈ ఘర్షణలో ఓ మహిళ తల పగిలింది. ఈ ఘటనలో శ్రీలతరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు.
పోలీసులకు వలపు వలవేసి!
పోలీసులు ఆమె గురించి ఆరా తీయగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగింది. అయితే అతనితో గొడవపడి వనస్థలిపురం స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వనస్థలిపురం ఎస్సై రామయ్య, కానిస్టేబుళ్లు నాగరాజు, రాజు తనను మానసికంగా వేధించారని, అర్ధరాత్రి ఫోన్ చేసి వేధిస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసింది. ఎస్సైలు రాజేందర్‌రెడ్డి, అతని స్నేహితుడు ఎస్సై మధుసూదన్‌రెడ్డి, అతని స్నేహితుడు ఎస్సై అరుణ్‌కుమార్ తో స్నేహంగా ఉన్నట్టు నటించి వారిపై కేసులు పెట్టించి డబ్బులు డిమాండ్చేసింది. ఎంతైనా ప్రభుత్వ ఉద్యోగులు కదా.. చేసేదేమీలేక ఆ మహిళకు డబ్బులు ఇచ్చి కేసులు మాఫీ చేయించుకున్నారు. కొద్దిరోజుల క్రితం తన కూతురును రేప్చేశారని తాను సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తిపై మరోకేసు పెట్టి జైలుకు పంపింది. ఇలా ప్రతిసారి పోలీసుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఈ మాయలేడీ అందరికీ వలవేస్తూ డబ్బులు లాగుతూ ఉంటుంది. చివరికి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో శ్రీలతరెడ్డి కటకటాల్లోకి వెళ్లింది.