Breaking News

‘ఆలేటి’.. సేవలో ఘనాపాటి!

‘ఆలేటి’.. సేవలో ఘనాపాటి!
  • నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్‌పై ప్రేమ
  • ఏఎల్‌ఆర్ కోచింగ్ సెంటర్‌లో యువతకు శిక్షణ
  • ఒకే గ్రామంలో 13 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు
  • సినీ ప్రొడ్యూసర్ ఆలేటి వెంకట్రామిరెడ్డిని సన్మానించిన అభ్యర్థులు

సామాజికసారథి, నాగర్‌కర్నూల్: ఆయన సామాజిక సేవలో ఘనాపాటి.. పేద విద్యార్థుల కోసం ఏదైనా చేయగలరు.. ఆయన కోచింగ్ ఇప్పించిన 13 మంది యువకులకు పోలీసు ఉద్యోగాలు రావడంతో ఆనందం ఉప్పొంగిపోయింది. వివరాల్లోకెళ్తే.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డే‌మాన్ గ్రామానికి చెందిన ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ ఆలేటి వెంకట్రామిరెడ్డి పేదింటి బిడ్డల కోసం తపించారు. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించారు. తన సొంత డబ్బుతో గ్రామంలోని ఏఎల్ఆర్ కోచింగ్ పేరుతో వందలాది మంది విద్యార్థులకు ఉచితంగా వసతి ఏర్పాటుచేశారు. అన్ని సౌకర్యాలతో సబ్జెక్టులతో నిపుణులను నియమించి కోచింగ్ ఇప్పించారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వెలువడిన ఫలితాల్లో 13 మంది యువకులకు పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ వచ్చాయి. ఎంతోమంది విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్న ఆలేటి వెంకట్రామిరెడ్డిని గ్రామస్తులు ఆదివారం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలైన సల్కరిపేట, అల్లిపూర్, శాయన్‌పల్లి గ్రామాల విద్యార్థులకు ఎలాంటి కోచింగ్ కావాలన్నా అన్ని వసతులు ఏర్పాటుచేస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ సుదర్శన్‌గౌడ్, మాజీ సర్పంచ్ బాబుసాగర్, మాజీఎంపీటీసీ చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది వీరశేఖర్, గ్రామపెద్దలు చంద్రయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.