Breaking News

కందనూలుకు తీరనున్న కష్టాలు

# పెరిగిన నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీ పడకలు
# 300 పడకల నుంచి 605 పడకలకు పెంపు
# ఫలించిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కృషి
# హెల్త్ మినిష్టర్ దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

సామాజికసారథి, నాగర్ కర్నూల్: కందనూలు ప్రజలకు వైద్యం కష్టాలు తీరనున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ వద్ద మెడికల్ కాలేజీ పడకలు భారీగా పెరుగనున్నాయి. ఇదివరకు ఇక్కడ కేవలం 300 పడకల ఆసుపత్రి ఉండగా రోగులకు సరిపడ వైద్య సేవలు అందడం గగనంగామారింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ఆసుపత్రి స్థాయిని పెంచడంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని సౌకర్యాలను కల్పించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి పై మంత్రి దామోదర రాజనర్సింహ్మ వెంటనే స్పందించారు. నాగర్ కర్నూల్ జిల్లా మెడికల్ కాలేజీ 300 పడకల నుంచి 605 పడకలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకు ఇక వైద్యం కోసం హైద్రాబాద్ మహబూ బ్ నగర్ వంటి పట్టణాలకు వెళ్లాల్సిన పని లేదని నాగర్ కర్నూల్ జిల్లా మెడికల్ కాలేజీ పడకలను 605పడకల స్థాయికి పెంచుతున్నట్లు ప్రకటించారు. మెడికల్ కాలేజీ స్థాయి పెంపు కోసం సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజ నర్సింహ, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర పెద్దలకు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా మెడికల్ కాలేజీ పడకలను పెంచేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కు జిల్లా ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.