Breaking News

జవాన్ రాకేశ్వర్ సింగ్ క్షేమంగా విడుదల

జవాన్ రాకేశ్వర్ సింగ్ క్షేమంగా విడుదల


సారథి, భద్రాచలం: ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. ఆరు రోజులుగా మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ గురువారం సాయంత్రం క్షేమంగా విడుదలయ్యారు. ఈనెల 3న ఎన్‌కౌంటర్ సమయంలో మావోయిస్టులకు చిక్కిన్ జవాన్‌ను వారు తమ వెంట బందీగా తీసుకెళ్లారు. అతనికి ఏ హానీ తలపెట్టకుండా క్షేమంగా విడిచిపెట్టాలని కుటుంబసభ్యులు, పలు ప్రజాసంఘాలు విజ్ఞప్తిచేశారు. జవాన్​ కూతురు కన్నీరు పెడుతూ తన నాన్నను ఏమీ చేయొద్దని వేడుకున్నతీరును ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది. మధ్యవర్తుల ద్వారా జవాన్‌ను విడుదల చేస్తామని మావోయిస్టులు సైతం ప్రకటించడంతో మధ్యవర్తిత్వం కోసం ఇద్దరు సభ్యుల బృందాన్ని ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం నియమించింది.

మధ్యవర్తుల సమక్షంలో జవాన్​ రాకేశ్వర్​ సింగ్​

ఈ మేరకు పద్మశ్రీ అవార్డు గ్రహిత ధరంపాల్ సైని, గోండ్వానా సమాజ్ ప్రసిడెంట్ తెల్లం బోరియాతో సహా ప్రభుత్వం తరఫునన ఇద్దరు సభ్యులు, ఏడుగురు జర్నలిస్టులు కలిసి మొత్తం 11 మంది బస్తర్ అడవికి చేరుకున్నారు. వందలాది గ్రామస్తుల సమక్షంలో జవాన్‌ను మావోయిస్టులు ఆ బృందానికి అప్పగించినట్లు ప్రకటించారు. మావోయిస్టుల చెర నుంచి జవాన్ విడుదల కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..