సారథి, కల్వకుర్తి: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్చేస్తూ నాగర్కర్నూల్జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కల్వకుర్తి ఆర్డివో రాజేష్ కుమార్, తహసీల్దార్ రాంరెడ్డికి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈనెల 12 నుంచి రిలే దీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోసం కల్వకుర్తి పోలీస్స్టేషన్లో వినతిపత్రం ఇవ్వగా అనుమతి లభించలేదు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే(ఐజేయూ) నేత, సీనియర్ జర్నలిస్టు గోలి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఆరేళ్లయినా నేటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. ప్రభుత్వం జారీచేసిన హెల్త్ కార్డులు నామమాత్రంగానే పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇళ్లస్థలాల కేటాయింపు, హెల్త్ కార్డుల జారీ, కొవిడ్ తో మృతిచెందిన జర్నలిస్టులకు రూ.ఐదులక్షల ఎక్స్ గ్రేషియా, కరోనాకు వైద్యం పొందుతున్నవారికి రూ.లక్ష, జర్నలిస్టుల భద్రతకు బీమా సౌకర్యం, అక్రిడిటేషన్ కార్డులను జారీ.. తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. చిన్న, పెద్ద పత్రికలంటూ తేడా లేకుండా జర్నలిస్టులందరికీ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు బచ్చు రామకృష్ణ, శ్రీధర్, కృష్ణయ్య, నిరంజన్, వకీల్, సురేష్, రవి, శివప్రసాద్, యూసఫ్ బాబా, శంకర్, ఫయాజ్, ఆంజనేయులు, సిరాజుద్దీన్, శ్రీను, క్రాంతి కుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
- July 17, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- Comments Off on జర్నలిస్టుల సేవలను విస్మరించడం అన్యాయం