Breaking News

బంగారు తెలంగాణలో ఆత్మహత్యలా?

బంగారు తెలంగాణలో ఆత్మహత్యలా?

సారథి, రామడుగు: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో యువత ఆత్మహత్యలకు పాల్పడడం విచారకరమని, నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిబాధ్యత వహించాలని బీజేవైఎం కరీంనగర్​ జిల్లా రామడుగు అధ్యక్షుడు దుర్శెటి రమేష్ అన్నారు. నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్య పాల్పడిన మహేందర్ యాదవ్, ప్రైవేట్​టీచర్ వెన్నం రవికుమార్ ఆత్మహత్యలపై అసమర్థ ప్రభుత్వ పాలనకు నిరసనగా రామడుగు మండల బీజేవైఎం శాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం సుమారు 1500 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నేటికి ఆత్మహత్యలు జరగడం ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనపై లేదని విమర్శించారు. బంగారు తెలంగాణ అని చెప్పుకునే సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువత, ప్రైవేట్​ టీచర్లను, లెక్చరర్లను ఎందుకు ఆదుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు పొన్నం శ్రీనివాస్ గౌడ్, దళిత మోర్చా ఉపాధ్యక్షుడు కొలపురి రమేష్, బీజేపీ అధికార ప్రతినిధి పోచంపెల్లి నరేష్, బీజేవైఎం కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, బీజేవైఎం ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, స్వామి, శ్రీను, అధికార ప్రతినిధి మనోజ్, అనిల్ కడారి, శ్రీను, అనంతరెడ్డి, సతీష్, రాజు బుర్ర, సాగర్ పూరెల్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.