సారథి, చొప్పదండి: సర్కారు భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 15న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం చొప్పదండి మండలం రుక్మపూర్ గ్రామంలో సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములను వేలం వేసి అమ్మడానికి నిర్ణయించడం దుర్మార్గమని, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి, వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టుబడిదారీవర్గాలకు, పార్టీ నాయకులకు అప్పనంగా కట్టబెట్టడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వేలం కోసం తెచ్చిన జీవోనం.13ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని, ప్రభుత్వ భూములను విద్యా, వైద్యం మౌలిక వసతులు, సదుపాయాల కల్పన కోసం, పరిశ్రమల స్థాపన కోసం వినియోగించాలని కోరారు. పేదల, దళితగిరిజన వర్గాలకు ప్రభుత్వ భూములను పంపిణీ చేయాలని, సర్వేనం. వారీగా భూములను సమగ్ర సర్వే చేయాలని డిమాండ్చేశారు. అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ బోర్డ్ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ధరణి వెబ్ సైట్ లో తప్పులను సరిదిద్దాలని కోరారు. అనంతరం చలో కలెక్టరేట్ కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు మచ్చ రమేష్, మండల నాయకులు లంక అజయ్, రంగు రమేష్ గౌడ్, లంక శ్రీనివాస్, సంపత్, వెంకటేష్, మల్లారెడ్డి పాల్గొన్నారు.