Breaking News

చిన్నపాటి వానకే కూలిన ప్రహరీ

  • June 6, 2024
  • Top News
  • Comments Off on చిన్నపాటి వానకే కూలిన ప్రహరీ
చిన్నపాటి వానకే కూలిన ప్రహరీ
  • నాగర్​ కర్నూల్​ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కంపౌండ్ గోడ నేలమట్టం
  • నాణ్యత లోపంతో ఏడాదికే కూలిపోవడంపై స్టూడెంట్స్​ ఆగ్రహం
  • కాంట్రాక్టర్​ ఒకరు… పనులు మరొకరు
  • బీఆర్ఎస్ లీడర్ కావడంతో పట్టించుకోని అధికారులు

సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా నెల్లికొండ గేట్ వద్ద ఉన్న గవర్నమెంట్ కోఎడ్యుకేషన్ డిగ్రీ కాలేజీ ప్రహరీ గురువారం తెల్లవారుజామున కురిసిన చిన్నపాటి వానకే కుప్పకూలింది. గవర్నమెంట్ నిర్మాణ పనులు కావడం, పైగా బీఆర్ఎస్ నేత కావడంతో ఇంజనీరింగ్ శాఖ అధికారులు సైతం నాణ్యతను పట్టించుకోలేదు. అయినా మనల్ని అడిగేవాడు ఎవరుంటారులే అన్నట్లుగా సదరునేత నాణ్యతను పక్కన పెట్టి తనకు తోచిన విధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కాంపౌండ్ నిర్మించారు. కానీ చిన్నపాటి ఈదురు గాలులు, వర్షానికే డిగ్రీ కాలేజీ కాంపౌండ్ కుప్పకూలి పోవడంతో పనుల నాణ్యతపై స్టూడెంట్లు, విద్యార్థుల తల్లిదండ్రులు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వ నిర్మాణాలు అంటేనే అందిన కాడికి దోచుకోవడం అన్నట్లుగా ఏదో మొక్కుబడి పనులు చేసి బిల్లులు డ్రా చేసుకుని అధికారులకు కొంత కమిషన్లు ఇస్తే చాలన్నట్లుగా తయారైంది. దీంతో లక్షలు పెట్టి నిర్మించిన కాంపౌండ్ కూలిపోవడంతో స్టూడెంట్లు, కాలేజీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పైగా ప్రస్తుతం కాలేజీ నిర్మించిన స్థలం సుమారు 6 ఎకరాలు ఉండగా బీఆర్ఎస్ నాయకులు, గతంలో దొరికిన కాడికి కబ్జా చేసేసి కేవలం ఎకరా స్థలంలోనే డిగ్రీ కాలేజీ నిర్మించారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం నాణ్యత లేకుండా నిర్మించిన కాపౌండ్ గోడ ఏడాది కాకుండానే చిన్న వానకే కుప్ప కూలి పోవడంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యత లేకుండా నిర్మాణాలు చేసిన టెండర్​ కాంట్రాక్టర్ దయాకర్​ రెడ్డి.. పనులు చేపట్టిన ఎంపీపీ నర్సింహరెడ్డిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.