- మీ పోరాటంలో తోడు ఉంటాం
- రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా జీవో 317
- టీపీసీసీ చీఫ్రేవంత్ రెడ్డి
సామాజికసారథి, హైదరాబాద్: ఉద్యోగ ఉపాధ్యాయులారా అధైర్యపడకండి.. 317 జీవో రద్దు కోసం ఉద్యోగ, ఉపాధ్యాయలు చేసే పోరాటంలో కాంగ్రెస్ పార్టీ తోడుంటుందని టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి అభయమిచ్చారు. సోమవారం సాయంత్రం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) 317 జీవో రద్దుకు మద్దతు తెలపాలని కోరింది. ఈ జీవో వల్ల వేలాదిమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ స్థానికతను కోల్పోవడం జరిగిందన్నారు. ఈ జీవో అమలులో జరిగిన తప్పిదాల వల్ల అనేకమంది గుండె పగిలి చనిపోయినా, విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరిగినా, ఎన్నో పోరాటలు చేసినా, ప్రభుత్వం పట్టించుకోవటం లేదని రేవంత్ రెడ్డికి వివరించారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29 న జిల్లా కలెక్టరేట్ల ముందు చేపట్టే ధర్నాకు మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 317 జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా ఉన్నందువల్ల ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించటమే కాకుండా ప్రధానమంత్రి, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి జీవో రద్దు కోసం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు స్థానికతకు విఘాతం కలుగుతుందని ఆ జీవోని ప్రధాని జోక్యం చేసుకొని రద్దు చేసే విధంగా ఫిబ్రవరి 5న హైదరాబాద్ విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీల బృందం ప్రధానిని అపాయింట్మెంట్ కోరుతామని చెప్పారు. అదే విధంగా ఫిబ్రవరి13న హైదరాబాద్ విచ్చేస్తున్న రాష్ట్రపతిని సైతం ఈ అంశంపై కలిసేందుకు అపాయింట్మెంట్ కోరతామని రేవంత్వెల్లడించారు. రేవంత్‌రెడ్డిని కలిసిన వారిలో టీపీసీసీ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి, అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్, టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, జాక్టో నాయకులు పోచయ్య, రవిశంకర్ రెడ్డి, మైకా శ్రీనివాస్, మహ్మద్ షౌకతలీ, ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, దేవరకొండ సైదులు, యాదగిరి ఉన్నారు.