- సీట్లు వచ్చిన స్టూడెంట్లకు వచ్చిన మార్కులపై అనుమానాలు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ కటాఫ్ మార్కులు ఎంత..?
- ఫలితాలపై తల్లిదండ్రుల ఆందోళన
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీ సెట్) ఫలితాలపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 5వ తరగతి గురుకుల స్కూళ్లల్లో ప్రవేశాల కోసం ఎప్రిల్ 23న నిర్వహించిన ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలు సోమవారం రిలీజ్ అయ్యాయి. ఈ ఫలితాల ప్రకారం ఎస్సీ,ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి సీట్లు కెటాయించనున్నారు. కానీ ఫలితాలలో టీజీసెట్ ఎంట్రెన్స్ రాసిన స్టూడెంట్లకు వచ్చిన మార్కులు ఎన్నో అధికారులు వెల్లడించడం లేదు. ఎంట్రెన్స్ టెస్ట్ రాసిన స్టూడెంట్ల హాల్ టికెట్ల వివరాలు ఎంట్రీ చేస్తే కేవలం నాట్ సెలెక్టెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ అని మెసెజ్ వస్తోంది. సెలెక్ట్ అయిన స్టూడెంట్లకు మాత్రం ఏ స్కూల్ లో సీటు వచ్చిందో తెలుపుతూ సీట్ అలాంట్ మెంట్ ఆర్డర్ వస్తూ ఆ స్కూల్ లో అడ్మిట్ కావాల్సిందిగా వివరాలు వస్తున్నాయి. ఫస్ట్ ఫేజ్ లో సీట్లు రాని స్టూడెంట్లకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలియడం లేదు. పైగా సీట్లు వచ్చిన స్టూడెంట్లకు కూడా ఎన్ని మార్కులు వచ్చాయో కూడా తెలపకుండానే అలాట్ మెంట్ ఆర్డర్లు వస్తుండడంపై అనేక మంది స్టూడెంట్ల తల్లిదండ్రులు ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీజీ సెట్ ఎంట్రెన్స్ కు హాజరైన స్టూడెంట్లకు ఎన్ని మార్కులు వచ్చాయో మొదట అధికారులు ఫలితాల ద్వారా తెలిపి ఆ తర్వాత సీట్ల కేటాయింపు చేస్తే ఎలాంటి అనుమానాలు ఉండేవి కావని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎంట్రెన్స్ టెస్ట్ రాసిన తర్వాత ఇచ్చిన క్వచ్చన్ పేపర్ ఆధారంగా తమ పిల్లలకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉందని ఇక్కడ ఫలితాల్లో మాత్రం ఫస్ట్ ఫేజ్ కు సెలెక్ట్ కాలేదని వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలలో ఏ కేటగిరీలో ఎన్ని మార్కులకు కటాఫ్ అయ్యిందన్న విషయం కూడా అధికారులు చెప్పకుండా నేరుగా సీట్లు కేటాయించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఎంట్రెన్స్ కు ముందే భారీగా ఫిర్యాదులు
ఐదో తరగతి ప్రవేశాల కోసం టీజీ సెట్ ఎంట్రెన్స్ టెస్ట్ తేది గత నెల 23న నిర్వహించక ముందే టీజీసెట్ కన్వీనర్ మల్లయ్యబట్టు, బోర్డు మెంబర్ రోనాల్డ్ రోస్ కు కొందరు తల్లిదండ్రులు ఫిర్యాదులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ప్రైవేట్ గురుకుల కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు తప్పుడు అడ్రస్ లతో బోగస్ బోనఫైడ్లు పెట్టి దరఖాస్తు చేస్తున్నట్లు ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు తదితర పట్టణాల్లో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఇక్కడి స్థానిక స్టూడెంట్లకు హైద్రాబాద్ , రంగారెడ్డి జిల్లాల్లో చదువుతున్నట్లు బోగస్ బోనఫైడ్లు పెట్టి టీజీ సెట్ ఎంట్రెన్స్ కు భారీగా దరఖాస్తులు చేశారని ఫిర్యాదులు వచ్చినా అధికారులు నిర్లక్ష్యంగా వాటిని పట్టించుకోలేదు. ప్రస్తుతం వచ్చిన ఫలితాల్లో అనేక మంది స్టూడెంట్లకు హైద్రాబాద్ గురుకుల స్కూళ్లల్లో సీట్లు కూడా వచ్చాయి. దీంతో అసలైన స్టూడెంట్లకు అన్యాయం జరుగుతున్నా అధికారుల్లొ చలనం లేకపోవడం గమనార్హం.
కటాఫ్ మార్కులు వెల్లడించాల్సిందే
ప్రస్తుతం విడుదలైన టీజీ సెట్ ఫలితాల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ కులాల వారీగా కటాఫ్ మార్కులు వెల్లడించాలని స్టూడెంట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నోటిఫికేషన్ లో అన్ని వివరాలు పొందుపరిచినా ఫలితాల విషయంలో ఎలాంటి వివరాలు లేకుండా సీట్ల కెటాయింపు జరగడంపై అనేక అనుమానాలున్నాయని అంటున్నారు. టీజీ సెట్ ఫలితాల్లో సైతం కొందరు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు అధికారులు అండగా ఉంటూ వారు దరఖాస్తు చేసుకున్న స్టూడెంట్లకే అధికంగా సీట్లు వచ్చేందుకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి టీజీ సెట్ ఎంట్రెన్స్ ఫలితాల్లో స్టూడెంట్ల మార్కులను బహిర్గతంచేసి సీట్లు కెటాయింపులో పారదర్శకత ఉండాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.